Students : విద్యార్థులు.. రాజకీయాలు... ఓ విద్యార్థి లోకమా..! మీ అడుగులు ఎక్కడ పడ్డాయి...
నీ కష్టం ఎవరి సొత్తు అయింది... మీ శ్రమ ఎవరి పాలై యింది...
జయభేరి, హైదరాబాద్ :
సమాజం నాకేమిచ్చింది అని అనుకోవద్దు.. ఈ సమాజానికి నేనే ఇచ్చాను అని ఆలోచించాలి అని ఏనాడు పెద్దలు మనకు ఒక మాట చెప్పారు. నిజమే ఏ విషయాల్లో మనం సమాజానికి ఇవ్వాలి.. ఏ విషయాల్లో సమాజం నుంచి మనం ఏం తీసుకోవాలి అనే విషయం మీద ఒక అవగాహన ఈనాటి యువతరానికి లేకుండా పోయింది. ఒకనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించిన పుచ్చలపల్లి సుందరయ్య దగ్గర నుంచి వేళ్ళ మీద లెక్కపెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నీతి నిజాయితీగా ఉన్న దాఖలు మనకు కనిపించడం లేదు. ఎందుకంటే పార్టీలు సిద్ధాంతాలు కట్టుబాట్లు నీతి నిజాయితీతో కూడుకున్న రాజకీయ జీవితాలు ఆనాడు మనం చూసేవాళ్లం. కానీ నేడు జరుగుతున్నది ఏంటి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తరుణంలో 10 ఏళ్లు దాటిన ఇంకా స్వార్థం నిండిన రాజకీయ పెత్తందారుల గుప్పిట్లోనే రాష్ట్రం నలిగిపోతూ.. ఇంకా యువత నిరుద్యోగ భారంతో సతమతం అవుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఎక్కడ పోయాయని ఈ నినాదాన్ని అందుకున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కుల దోసి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన.. విద్యార్థి లోకంలో ఇంకా నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉంది.
నిజమే చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం దొరుకుతుందా అంటే అది అనుమానమే. చదువుకున్న చదువు జీవితానికి ఉపయోగపడుతుంది అంటే అది కూడా అనుమానంగానే ప్రశ్నార్ధకంగానే మిగులుతుంది. మరి చదువుకున్న చదువు దేనికోసం!? ఎవరికోసం!? ఎందుకోసం.? అని అనేక సందేహాలు మనకు నివృత్తి అవుతాయి. మరి యువత సమాజానికి ఏం చేయాలి? ఈ సమాజం నుంచి యువత ఏం తీసుకుంటుంది? అనే కోణాల్లో నుంచి ఆలోచిస్తే ఈ సమాజంలో మంచి చెడు రెండు దొరుకుతాయి. యువత మంచిని పట్టించుకోకుండా చెడు మార్గాల వైపు తిరుగుతూ జీవితాన్ని అతి చిన్న ప్రాయంలోనే బలి చేసుకుంటున్నా వర్గం ఒకవైపు యువత ఉంటే.. మరోవైపు యువత పుస్తకాలలోని అక్షరాలను, జీవితాల్లోని అనుభవాలను మలిచి బ్రతుకును కొనసాగిస్తున్న యువత లేకపోలేదు. ఒకవైపు చంద్రమండలం, సూర్య మండలాన్ని అందుకునే స్థాయిలో మనం ఆధునిక సాంకేతిక జీవన విధానంలో ముందుకు అడుగేస్తున్న ఇంకోవైపు యువత తీరు తెన్నులు ఆలోచనలు పాతాళానికి తొక్కిస్తున్నాయి. అందుకే యువత రాష్ట్ర రాజకీయ నాయకుల చేతిలో ఆయుధాలుగా మారిపోతున్న నేటి తరుణంలో యువత తీరుతెనులు మార్చుకోవాలి? కచ్చితంగా రాజకీయాల్లో యువత ప్రవేశించి రాజకీయ ప్రక్షాళన జరపాలి?
యువత రాజకీయాల్లోకి వస్తే కుటుంబ పాలనలో కొంతమంది రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తరుణంలో వారు యువతను ముందుకు రానివ్వగలుగుతారా? నిజమే ఎవరు నిన్ను నన్ను శభాష్ అని మెచ్చుకొని అవకాశాలను అందివ్వరు! కచ్చితంగా అవకాశాలను అందుకోవడం మనకు కావాలంటే గుంజుకొని లాక్కోవడం ఇవి నేర్చుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న సంగతి మరిచిపోకూడదు! మనకు దక్కనిది దానికోసం నిర్విరామంగా కృషి చేయాల్సిందే. అదే రాజకీయం.. ఇంకెన్నాళ్లు పుస్తకాలు చదువుతూ.. చరిత్రలు చదువుతూ.. కాలాన్ని జీవితాన్ని వృధా చేసుకోవడం.. నీది నాది మన జీవితమే ఒక చరిత్ర కావాలి మనకంటూ చరిత్రలో ఓ పేజీని లిక్కించుకోవాలి..
రాజకీయాల్లో యువత ప్రవేశిస్తే రాజకీయ ప్రక్షాళన కచ్చితంగా జరుగుతుంది. ఎంతోమంది పోయి స్టూడెంట్లు రాజకీయాల్లోకి వచ్చి దొరల పెత్తందారుల చేతిలో కీలుబొమ్మలుగా మారి రాజకీయ లబ్ధి పొంది, పదవులు పొంది బాగానే వెనకేసుకున్నారు గాని తమ జాతిని, తన ప్రజలని ఏనాడు పట్టించుకున్న పాపాను పోలేదు.. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో చలామణి అవుతున్న నేతలంతా ఒకప్పటి మనలాగే విద్యార్థులే.. అయితే విద్యార్థి దశనుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న యువత నిద్రమత్తును వీడాలి... రాజకీయంలో కుల, మాత, ప్రాంత భేదాలను మరిచి ప్రజా సంక్షేమమే ఏజెండగా మార్చుకొని తన నియోజకవర్గ ప్రజల కోసం యువత రాజకీయాల్లోకి ప్రవేశించి తమ ఉనికిని చాటుకోవాలి.. రాజకీయాల్లోకి రావాలంటే అంగ బలం, ఆర్థిక బలం ఉండాలి కదా అని అనుకునే అనుమానాలు మీకు కలుగవచ్చు?
నిజమే రాజకీయాల్లోకి రావడానికి ఆర్థిక బలం, అంకబలం కచ్చితంగా అవసరమే... ఇన్ని సంవత్సరాలు ఒక నాయకుని చేతిలో కీలుబొమ్మగా పనిచేస్తున్న విద్యార్థి సంఘాలు ఆ సంఘాల్లో నుంచి నాయకులు వస్తే పనిచేసిన నాయకుడు మీకు ఎందుకు వత్తాసు పలకడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా... ఎందుకంటే మీ నాయకుడు నిన్ను ఒక సేవకునిగానే, సైనికునిగానే, ఆయుధంగానే మార్చుకుంటాడు తప్ప నిన్ను నాయకుడిని చేసే ఆలోచనలు మీ నాయకునికి రావు.... అందుకనే ఒక నాయకుని దగ్గర ఊడిగం చేస్తున్నావు..
విద్యార్థి లోకమా.. ఒక్కసారి మీ బలం ఏమిటో, నీ బలహీనత ఏమిటో, నీ శక్తి ఏమిటో ఒక్కసారి ఆలోచించు... స్వామి వివేకానంద నిజాయితీగా ఒక మాట చెప్పాడు.... నీదే ఈ భారతదేశం యువతరమా ఈ దేశాన్ని నువ్వే ఏలుకో అని చెప్పి యువతరాన్ని ఉత్తేజ పరచడానికి స్వామి వివేకానంద భారత దేశ యువతను ఆలోచించి ఒక పెద్ద వాగ్దానాన్ని చేశాడు... కానీ ఈ యువత స్వామి వివేకానంద సూక్తుల్ని చదువుతుంది, వింటుంది ఆచరణాత్మకంగా మాత్రం అడుగులు వేయదు... ఎందుకంటే మా అమ్మ నాన్నకు చదువులేదు, మా ఇంట్లో పేదరికం ఉంది కాబట్టి నేను ఆ నాయకుని వెంట తిరిగితేనే మా జీవితం గడుస్తోంది.. ఆ నాయకుడు మా అన్న.. మాకు ఏం కావాలో తనకు తెలుసు మా అయ్యా చేశాడు.. మా తాత చేశాడు ఇప్పుడు.. నేను ఆ నాయకులు దగ్గర సేవ చేస్తున్నాను అనే ఒక చెడు ఆలోచన నుంచి ఇకనైనా మార్పు చెందాలి... ఒకప్పుడు నలిగిన తెలంగాణ రాష్ట్రంలో నైజాం నుండి తరిమికొట్టి హైదరాబాదు రాష్ట్రంగా చేసుకొని పరిపాలన చేసి నాటి ఉద్యమకారుల స్ఫూర్తి.. నేటి ఉద్యమకారుల చరలో చిక్కుకొని నలిగిపోతోంది... ఒక్కమాటలో చెప్పాలంటే ‘జై తెలంగాణ’ ఇది మన ఆత్మగౌరవం.. ఇది మన పోరాటం అన్న మాటలు ఇప్పుడు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.... ప్రత్యేక రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేసుకుంటేనే కదా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.... మరి అదే యువత తిరగబడి రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఎందుకు మార్పు చెందదు రాజకీయ ప్రక్షాళన ఎందుకు జరగదు అని ఒక్కసారైనా ఆలోచించారా!?
ప్రతి నాయకునిలో కచ్చితంగా స్వార్థపూరితమైన ఆలోచనలు దాగి ఉంటాయి. నువ్వు ఆ రాజకీయ నాయకుడికి అవసరం.. నువ్వు విద్యార్థి సంఘానికి లీడర్ కాబట్టి ఆ నాయకుడు నిన్ను పావుల వాడుకుంటాడు... నీ కావలసింది నువ్వు అడగకముందే ఇస్తుంటాడు... నీ బలం, బలహీనతలు తెలుసుకొని నిన్ను తన కింద చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు.... ఇకనైనా అలాంటి కాలానికి స్వస్తి చెప్పి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మూడుసార్లు ఎన్నికలు జరిగినా.. ఓ విద్యార్థి లోకమ మీ అడుగులు ఎక్కడ పడ్డాయి... నీ కష్టం ఎవరి సొత్తు అయింది... మీ శ్రమ ఎవరి పాలైంది... రెండు పడవల మీద ప్రయాణం మనం చేయలేం.. ఇది ఎంత నిజమో ఖచ్చితంగా రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా ఉంటున్నావో విద్యార్థి లోకమా ఇకనైనా కళ్ళు తెరువు నీకంటూ అధికారం ఇచ్చిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈ మాటలు మీకు చెబుతున్నాను... నీ జాతి కోసం, నీ వర్గం కోసం, నీ ప్రజల కోసం, నిన్ను నువ్వుగా అస్త్రంగా మారి సామాన్యుడు చేతిలో సామాజిక అస్త్రంగా ఆయుధంగా ఎదిగి రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలి... ఏం చేస్తావో.. ఎలా చేస్తావో ఏమో ఎవరికి చెప్పనవసరం లేదు. అందుకే శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు... నువ్వు వెళ్లేదారిలో 100 కుక్కలు మొత్తుకున్నా వాటికి సమాధానం చెప్పనవసరం లేదు... అలా చెప్పుకుంటూ పోతే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు అన్న ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకో.... ప్రత్యేక రాష్ట్రంలో ‘జై తెలంగాణ’ అని గొంతేంటి అరచి రాష్ట్ర సాధనలో ఉద్యమ వీరుడుగా నిలిచిన విద్యార్థులు కచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో పాలు పంచుకోవాలి...
విద్యార్థులు రాష్ట్ర రాజకీయాల్లోకి రాకుండా ఈ నేతలు చేస్తున్న కుటిల పన్నాగాలని ఒక్కసారి మీకు చెప్తాను అర్థం చేసుకోండి... ఓటుకు నోటును అందించి.. సారా, బీరు, బిర్యానీ అందించి ఎలక్షన్లు పూర్తిగా చాలా కాస్ట్లీగా చేసిన దౌర్భాగ్యస్థితికి తీసుకొచ్చిన ఈ నేతలను చూసి ఇకనైనా కళ్లు తెరవండి.. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో.. మీ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి సంక్షేమం జరగలేదో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. కచ్చితంగా నీ ప్రజల మద్దతును కూడగట్టుకోవడానికి డబ్బు అవసరం లేదు. వారికి భరోసాను కలిగించాలి.. నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మా కోసం ఈ విద్యార్థి పని చేస్తాడు అన్న ఆశను కలిగించినప్పుడు నీ కరెన్సీ కట్టలకు ప్రజలు అమ్ముడు పోరు...
కచ్చితంగా ‘విద్యార్థులు.. రాజకీయాలు’ అనే ఈ శీర్షికకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. కచ్చితంగా రాజకీయాల్లోకి విద్యార్థులు వచ్చినప్పుడే ఆ రాష్ట్రం, ఆ నియోజకవర్గ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. చిన్న రాష్ట్రాలు, చిన్న నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం వల్ల వాటి అభివృద్ధి సంక్షేమం అవుతుంది అని భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఏర్పాటుచేసిన ఆర్టికల్ ఉపయోగించుకున్న ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు తక్కువ కులంలో విద్యార్థులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరిన వాళ్లు రాజకీయాల్లో వచ్చిన తర్వాత వారిని ఎందుకు ముందుకు రానివ్వడం లేదు. ఇకనైనా గుర్తించి ఆలోచించి ఆచరణాత్మకంగా అడుగులు వేయండి.... రాజకీయంగా అధికారం సాధిస్తేనే తప్ప ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనకంటూ ఓ చరిత్రను మనమే రాసుకోవాలి... చరిత్రలో మనకంటూ ఓ పేజీని రాసుకోవచ్చు.... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎంత నిజమో.. ఇదే తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థి లోకం రాజ్యాధికారం దక్కించుకునే వరకు ఈ రాష్ట్రం ముందుకు పోదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. అనేది ఖచ్చితమైన నా అభిప్రాయం....
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు
Post Comment