మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం
రామన్నగారి రాఘవేందర్ గౌడ్
జయభేరి, మేడ్చల్ : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపిస్తాయని మేడ్చల్ డివిజన్ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసే నాయకులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా టికెట్లు కేటాయించి బరిలో ఉన్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాపాలనకు ప్రజల నుండి మంచి ఆదరణ ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అధికార పార్టీ వైపు ఉన్నారని, ఎల్లంపేట్ మున్సిపాలిటీ లోని 24 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధిస్తుందన్నారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదని కెసిఆర్ రాష్టాన్ని అప్పుల ఊబిలో ముంచిందని రాఘవేందర్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్, రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేసి అధికార పార్టీకి పట్టం కట్టాలని కోరారు.


