డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడపాలి
- ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి
- ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి
- ఏటూర్ నాగారం ఏఎస్పి మనన్ భట్ ఐపీఎస్
జయభేరి, వెంకటాపురం, మార్చి 5 : వెంకటాపురం మండలం ఆటో, కార్ డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎటూర్ నాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్ అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరైవ్.. అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం వెంకటాపురం మండల కేంద్రంలోని కాఫెడ్ స్కూల్ ఆవరణలో స్థానిక సర్కిల్ పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు,కారు డ్రైవర్లు తాము నడిపే వాహనాలను అత్యంత జాగ్రత్తగా నడపాలని సూచించారు. మీపై నమ్మకం పెట్టుకుని ప్రయాణించే ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల బాధ్యత అని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమారిటన్ పథకం ద్వారా ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన వ్యక్తికి రూ.25 వేలు నగదు ప్రోత్సాహకం అందజేయబడుతుందని తెలిపారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కార్యక్రమానికి హాజరైన వాలీబాల్ జట్లకు క్రీడా కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సి.ఐ ముత్యం రమేశ్, వెంకటాపురం ఎస్.ఐ కె.తిరుపతిరావు, వాజేడు ఎస్.ఐ జె.సతీష్,పేరూరు ఎస్.ఐ జి.కృష్ణ ప్రసాద్, పి.ఎస్.ఐలు జి.తిరుపతి రెడ్డి, ఎమ్.సాయికృష్ణ, పోలీస్ సిబ్బందితో పాటు రాజకీయ నాయకులు వాజేడు, వెంకటాపురం ఆటో యూనియన్ డ్రైవర్లు పాల్గొన్నారు.



