కేసీఆర్ కు సిట్ నోటీసులు సరికాదు

మెట్టు శ్రీకాంత్ రెడ్డి..

కేసీఆర్ కు సిట్ నోటీసులు సరికాదు

జయభేరి, మేడ్చల్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పిలవడం రాజకీయ కుట్రలో భాగమే అని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మెట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వెబ్ సిరీస్ ను తలపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు మాత్రమే అన్నారు. గ్రూపు రాజకీయాలు, అవినీతి ఆరోపణలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఎన్నో సంవత్సరాల చిరకాల ఆకాంక్ష స్వరాష్ట సాధనను సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అలాంటి నేతపై సిట్ నోటీసులతో బురదజల్లడం సరైన వ్యవహారం కాదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎలాంటి సంబంధం లేని కేసులో విచారణ చేయడం వ్యవస్థలను దుర్వినియోగం చేసి బిఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ అధినేత వ్యవస్థలపై విశ్వాసంతో విచారణకు సహకరిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై చేస్తున్న ఆరోపణలకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ నిత్యం పోరాటం చేస్తుందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Views: 40