Peerjadiguda : పీర్జాదిగూడ పెద్దచెరువు కబ్జాల కలకలం
చెరువులను మింగుతున్న అక్రమార్కులు..
హైకోర్టు ఆదేశాలతో కూడా ఆగని కబ్జాలు..
గతంలో ఎఫ్టీఎల్ లో నిర్మించిన అక్రమ నిర్మాణలు కూల్చిన ఇరిగేషన్ అధికారులు..
ఎన్నికల విధుల్లో అధికారులు.. చెరువులో చకచక అక్రమ నిర్మాణాలు...
అధికార పార్టీ అండతో చెరువును మింగి సొమ్ముచేసుకుంటున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు..
పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు..
జయభేరి, మేడిపల్లి :
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపంతో చెరువు ఏఫ్టిఎల్, బఫర్ జోన్ భూమిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. సహజ నీటి వనరుల ఆక్రమణల వల్లే పీర్జాదిగూడ ప్రజలు బీభత్సమైన వరదల్లో చిక్కుకొవడానికి సాక్షంగా నిలిచారు. వరదల సమయంలో చెరువు సమీపంలో ప్రజలు చిక్కుకొని బిక్కుబిక్కు మంటూ గడిపిన క్షణాలను నేటికీ మర్చిపోలేక పోతున్నారు. అధికారుల ఉదాసీనత, ప్రజా ప్రతినిధులు, నాయకుల స్వార్ధం వెరిసి రోజుకింత కుచించుకుపోతుంది. చెరువులను రక్షించాల్సిన వారే భక్షనకు అధ్యం పోస్తుంటే ఇలాంటి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు పునరావృత్తం అవుతూనే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విలేజ్ నక్ష ప్రకారం పెద్ద చెరువు విస్తీర్ణం 34.11 ఎకరాలు ఉండగా ప్రస్తుతం అక్రమార్కుల వల్ల సగం చెరువు మిగిలిందని ఇప్పటికి చర్యలు చేపట్టక పొతే ఉన్న చెరువు కూడా మిగలదంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తీరుపై దుమ్మేత్తి పోస్తున్నారు. గత ప్రభుత్వంలో పీర్జాదిగూడ పెద్ద చెరువు సుమారు రూ.15 కోట్లతో రిటర్నింగ్ వాల్, ఆహ్లాధాకరమైన వాతావరణంతో సుందరంగా తీర్చిదిద్ది మినీ ట్యాంక్ బండ్ మాదిరి అభివృద్ధి చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో అధికార పార్టీ అండతో సహజ వనరులను దోచుకోవడానికి కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు తెరలేపడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది.

హైకోర్టు నివేదిక సమర్పించిన అధికారుల బృందం ...
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో చెరువులు కుంటలు నాలాల కబ్జాలపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటి సంరక్షణ,అభివృద్ధి, పురోగతిపై అధ్యాయనానికి డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గాడి ప్రవీణ్ కుమార్ మరియు రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ టి శ్రీకాంత్ రెడ్డి నేతృత్వం లోని కమిటీ సభ్యుల బృందంతో కూడిన కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే ఈ బృందం అన్ని ప్రాంతాలతో పాటు పీర్జాదిగూడ పెద్ద చెరువు సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పెద్ద చెరువు సుందరీకరణ పై హర్షం వ్యక్తం చేస్తూ చెరువు యొక్క విస్తీర్ణం, ఆక్రమణలపై వివరాలు సేకరించి నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. అధికారుల బృందం నివేదిక న్యాయస్థానంలో ఉండగానే కబ్జా దారులు బరితెగించి అక్రమనలకు పాల్పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


