ఘనంగా కట్ట మైసమ్మ ఆలయ జాతర
వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్... ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు
జయభేరి, శామీర్ పేట్, మే 12:
శామీర్ పేట్ లోని పెద్ద చెరువు వద్ద వెలసిన కట్ట మైసమ్మ ఆలయ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో భవిష్యవాణి, పోతరాజుల విన్యాసాలు, గంప ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ వేడుకలకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తోటకూర వజ్రేశ్ యాదవ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్,కట్ట మైసమ్మ టెంపుల్ చైర్మన్ మహేందర్ యాదవ్ నాయకులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఇక ఈ వేడుకలను తిలకించడానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆలయ సిబ్బంది అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కట్ట మైసమ్మ అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించి సల్లంగా ఉండాలని వేడుకున్నారు.

Post Comment