మంత్రి సమక్షంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ
నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
జయభేరి, దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల పరిధిలోని పోలేపల్లి X రోడ్డు ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం నుంచి మంజూరు అయిన నూతన రేషన్ కార్డులను నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎస్టి, ఎస్సీ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ,నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోరిన విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల అభివృద్ధి ,ఎస్సి,ఎస్టి సబ్ ప్లాన్ నిధులు కేటాయించి తన వంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి చెప్పారు.
గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, అలాంటిది తమ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నదని, అంతేకాక ధనవంతులతో సమానంగా సన్న బియ్యంతో భోజనం చేసే విధంగా చర్యలు చేబడుతున్నాం.
ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిదే అన్నారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు, 42 శాతం బీసీ రిజర్వేషన్ కు సిఫారసు చేయడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా కులగణన చేశామని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు పేదలకే చేరాలని తెలిపారు. తన మంత్రిత్వ శాఖల ద్వారా తప్పనిసరిగా దేవరకొండకు ఎక్కువ నిధులను ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి పునరుద్గాటించారు.
స్థానిక శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, అందులో భాగంగానే దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు కొత్తగా 11736 కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరిగిందని, అంతేకాక రేషన్ కార్డులలో 15837 మందిని సభ్యులుగా చేర్చి వారందరికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం అని అన్నారు.ప్రతి ప్రభుత్వ పథకాన్ని పొందేందుకు రేషన్ కార్డు అవసరమని ,గత పది సంవత్సరాలలో ప్రభుత్వం రేషన్ కార్డులివ్వనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రూపాయల రైతు భరోసాని ఇచ్చిందని, రుణమాఫీలో భాగంగా దేవరకొండ నియోజకవర్గం లో 360 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సన్నబియ్యమిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇతర నియోజకవర్గాలతో సమానంగా దేవరకొండను అభివృద్ధి చేస్తానని తెలిపారు.
దేవరకొండ నియోజకవర్గానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో ఎక్కువ నిధులు కేటాయించాలని, రహదారులు లేని తండాలకు రహదారులకు నిధులు మంజూరు చేయాలని ,మైదాన ప్రాంతంలో ఐటిడిఏ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1800 కోట్ల రూపాయలతో డిండి ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, దేవరకొండ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని, భూ భారతి, బిసి కులగనన, చేపట్టామని, దేవరకొండ లాంటి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అని, అయితే చనిపోయిన వారి పేర్లను రేషన్ కార్డులో నుండి తొలగించే విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పాలని కోరారు. సన్న బియ్యం పంపిణీ విషయంలో చౌకధర దుకాణా డీలర్లు పారదర్శకంగా ఉండాలని ,ఈ విషయంలో ఎలాంటి ఆరోపణలున్న తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు కోరారు.
అన్ని ప్రభుత్వ పథకాలు లబ్దిపొందేందుకు ,ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి అని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ మాట్లాడుతూ. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 62155 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, అంతేకాక 80201 మందిని రేషన్ కార్డులలో కొత్తగా సభ్యులుగా చేర్చడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, అటవీ భూముల సర్వే తదితరాల వల్ల భూ సమస్యలు తీరే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,NSUI నాయకులు,లబ్ధిదారులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.


