జిల్లాలకు 300 క్లబ్‌లు ఇవ్వాలని టీడీసీఏ మెరుపు ధర్నా
టీడీసీఏ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి సహా పలువురు అరెస్టు
హెచ్‌సీఏ పేరు తెలంగాణ క్రికెట్ సంఘంగా మార్చాలని డిమాండ్
జయభేరి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు అనుబంధంగా జీహెచ్ఎంసీ పరిధిలో 200లకు పైగా క్లబ్‌లు ఉన్నట్టుగానే మిగిలిన తొమ్మిది జిల్లాల్లో 300 క్లబ్‌లకు సభ్యత్వం ఇవ్వాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. శనివారం ఉప్పల్ స్టేడియం ముందు వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీసీఏ ప్రతినిధులు మెరుపు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... తక్షణమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరును తెలంగాణ క్రికెట్ సంఘంగా మార్చాలని డిమాండ్ చేశారు. జిల్లాల్లోనూ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. లేదంటే హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలకు కలిపి తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీసీఐకి హెచ్‌సీఏ లేఖ రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిమ్మి బాబు, మల్లికార్జున్, శరత్, సుధీర్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.


