కౌలు రైతు గుర్తింపు ఎలా?
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో సిసిఆర్‌సిపై చర్చ
- ఎల్ఇసిని తొలగించి కొత్త చట్టం తెచ్చిన వైసిపి సర్కార్
- టెనెంట్లను గుర్తించి పథకాలిస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ
- పాత పద్ధతే అయితే భరోసా మాదిరే ఆర్థిక సాయం వగైరా వగైరా
- నష్టపోనున్న వాస్తవ సాగుదారులు
జయభేరి, అమరావతి :
వైసిపి సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు టిడిపి కూటమి ప్రభుత్వం రెండవ సంతకం చేసిన తరుణంలో గడచిన ఐదేళ్లలో కౌలు రైతులకు ఇబ్బందికరంగా తయారైన ఎపి పంట సాగుదారుల హక్కు చట్టం (సిసిఆర్‌సి) వైపునకు అందరి దృష్టి మళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపు కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణ అర్హత కార్డు (ఎల్ఇసి) చట్టాన్ని జగన్ సర్కారు వచ్చీరాగానే 2019 ఆగస్టులో రద్దు చేసి, అంతకంటే మెరుగైన చట్టం అంటూ సిసిఆర్‌సి చట్టాన్ని తీసుకొచ్చింది. కాగా తమ భూములను కౌలుకు ఇస్తున్నట్లు భూయజమానులు రాతపూర్వకంగా సమ్మతి తెలిపితేనే కౌలు రైతులు గుర్తింపు పొందుతారంటూ విధించిన నిబంధన కౌలు రైతుల యావజ్జీవాలూ కుంగదీసింది.
సంక్షేమం అన్నారు..
టిడిపి-జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులందజేసి అన్ని సంక్షేమ పథకాలూ అందిస్తామని, పంటల బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. దాంతో కౌల్దార్ల గుర్తింపునకు అడ్డంకిగా ఉన్న సిసిఆర్‌సి చట్టాన్ని ఏం చేయబోతున్నారనే విషయంపై కౌలు రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. మేనిఫెస్టో అమలులో భాగంగా రైతుల, యజమానుల భూములకు రక్షణ లేకుండా చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు పూనుకున్న కూటమి సర్కారు, కౌలు రైతుల సంక్షేమాన్ని దెబ్బతీస్తున్న సిసిఆర్‌సి యాక్ట్‌పైనా స్పందించాలంటున్నారు.
ఎల్ఇసి నుంచి సిసిఆర్‌సి దాకా..
కౌలు రైతుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2011లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఎల్ఇసి చట్టం తెచ్చింది. భూయజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులను రెవెన్యూ అధికారులు గుర్తించాలని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ చట్టం అమల్లో ఉన్నప్పటికీ 2014ా2019 మధ్య టిడిపి ప్రభుత్వం ఎల్ఇసి చట్టానికి సమాంతరంగా సాగు ధ్రువీకరణ పత్రాలను (సిఒసి) ప్రవేశపెట్టింది. సిఒసిలను వ్యవసాయాధికారులు జారీ చేయాలంది. దాంతో ఎల్ఇసి క్రమంగా నిర్వీర్యమైంది. ఎల్ఇసి, సిఒసిలు తక్కువగా జారీ కాగా, కొంత మందికే బ్యాంక్‌లు రుణాలిచ్చాయి. 2019లో అధికారంలోకొచ్చిన వైసిపి సర్కారు మొత్తానికే ఎల్ఇసి చట్టాన్ని రద్దు చేసి, సిసిఆర్‌సి యాక్ట్ తెచ్చింది. ఈ ఐదేళ్లలో ఏడాదికి కార్డుల జారీ రెండు మూడు లక్షలకు మించలేదు.
గరిష్టంగా ఏడాదికి లక్ష మందికి లోపే బ్యాంక్‌లు అరకొరగా రుణాలిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది కౌలు రైతులున్నారని ప్రభుత్వం అంగీకరిస్తూండగా, గుర్తింపు మాత్రం నామమాత్రంగా ఉంటోంది. భూమిలేని కౌలు రైతులు ఆరు లక్షల మంది ఉంటారని అంచనా. నవరత్నాల్లో భాగంగా వైసిపి అమలు చేసిన రైతు భరోసా పథకం కౌలు రైతులకూ వర్తింపజేశామని చెప్పి, ఆచరణలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకేనన్నారు. ఒసి కౌల్దార్లకు లేదన్నారు. ఐదేళ్లల్లో ఒక్క ఏడాది కూడా లక్ష మందికి మించలేదు. గుర్తింపు లేక రుణాలు, సబ్సిడీ సీడ్, రాయితీపై ఉపకరణాలు, పంటల బీమా, ఇతర ప్రభుత్వ పథకాలు, చివరికి పండించిన పంట కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేని దుస్థితి కౌలు రైతులది.
ఇప్పటి యాక్ట్‌తో దగానే..
టిడిపి కూటమి సర్కారు తన మేనిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులిస్తామని, పథకాలు అమలు చేస్తామని పేర్కొంది. దాంతో గుర్తింపు ఎలా అనే దానిపై కౌల్దార్లలో ఉత్కంఠ నెలకొంది. సిసిఆర్‌సి యాక్ట్‌తో గుర్తింపు కష్టం. అదే జరిగితే రైతులకు ఏటా ఇస్తామన్న రూ.20 వేల ఆర్థిక సాయం సైతం వైసిపి ‘భరోసా’ మాదిరే అవుతుంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలే సిసిఆర్‌సి యాక్ట్‌ను రద్దు చేయడం, లేదంటే కొన్ని నిబంధనలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని కౌల్దార్లలో చర్చ జరుగుతుంది. అప్పుడే కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు కౌలు రైతుల సంక్షేమం సాకారమవుతుందన్నది కౌలు రైతుల మాట.


