మూసీ ప్రక్షాళనకు తడిసిమోపెడు
దాదాపు 267 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణానదిలో కలిసే మూసీ నది..కాలుష్య కారకాలు, పరిశ్రమల వ్యర్థాలతో నిండుకుని విషవాయువులు వెదజల్లుతోంది. మూసీ పరివాహక పంటలు సైతం దాని ప్రభావంతో విషతుల్యమవుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మూసీకి ఆనుకుని దాదాపు పన్నెండు వేల పరిశ్రమలు ఉన్నాయి.
హైదరాబాద్, జూలై 23 :
భాగ్యనగరంలో ఒకప్పుడు మూసీ నదికి ఎంతో ఘనమైన చరిత్ర ఉండేది.దాని మీద ఆధారపడి వ్యవసాయాధారిత పనులు నిర్వహించుకునేవారు. తాగు నీటి అవసరాలు తీర్చడంలోనూ మూసీ తన ప్రత్యేకత చాటుకునేది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలనుంచి నల్గొండ దాకా మూసీ ప్రవాహం సాగేది.
కొన్ని పరిశ్రమలు వదిలే రసాయనాలు, వ్యర్థాలు మూసీని మురికికూపంగా మార్చేశాయి. ఇక హైదరాబాద్ కాలనీల మధ్య నుంచే ప్రవహించే నాలాలు షుమారు 50కి పైగా ఉన్నాయి. నాలాలనుంచి వెలువడే చెత్తాచెదారం అంతా చివరకు కలిసేది మూసీ నదిలోనే. ఇక మూసీ నది ప్రక్షాళన కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాటుచేసింది. మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు అయ్యే వ్యయాన్ని ఈ సంస్థ అంచనా వేసి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వానికి నివేదికలు పంపింది. నివేదికల ఆధారంగా విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయని అప్పట్లో ప్రతిపక్షాలు గోలపెట్టాయి.ఐదేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ నది బ్యూటిఫికేషన్ పనులకు శ్రీకారం చుట్టింది. మూసీ పరివాహక ప్రదేశాలలో అక్రమ నిర్మాణాలు, పిచ్చి మొక్కలు తొలగించి వాటి స్థానంలో సుందరమైన పార్కులు, బోటింగ్ ట్రిప్ లు ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చాలని భావించి అప్పట్లో ఈ బ్యూటిఫికేషన్ పనుల కోసం కేసీఆర్ సర్కార్ దాదాపు రూ.4000 కోట్ల వరకూ నిధులు విడుదల చేస్తామని ఊదరగొట్టారు.
అవన్నీ ప్రకటనల వరకే తప్ప నిధులు మాత్రం విడుదల చేయలేదు. కేవలం నాలుగు వందల కోట్లను మాత్రమే విడుదల చేసి చేతులు దులిపేసుకుంది. చాలీచాలని నిధులతో పూర్తి స్థాయి బ్యూటిఫికేషన్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి రాగానే మూసీపై నెలరోజులకొకసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని.. మూసీ ప్రక్షాళనకు దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టాలని భావించారు. ఓ పక్కన రైతు రుణ మాఫీ, సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర సర్కారుకు తలకుమించిన భారంగా తయారయింది.
ఇంత భారీ ఖర్చు పెట్టి మూసీని ప్రక్షాళన చేసినా ..హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే నాలా నీరు కలిసేది మూసీ లోనే. మూసీ ప్రక్షాళన కన్నా ముందుగా నాలాని తరలించాలి. మళ్లీ నాలా ను తరలిస్తే కొన్ని వేల కోట్లు.. అలాగే రసాయన, ఫార్మా పరిశ్రమలన్నీ కూడా తరలించాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రభుత్వానికి తలకు మించిన భారమే. దీనిపై ఎంత ఖర్చుపెట్టినా వృథాయే అని కొందరు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. కేసీఆర్ కూడా ఇన్ని లొసుగులున్నాయనే మూసీ ప్రక్షాళన అంశాన్ని లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా మూసీ ప్రక్షాళన అంశాన్ని పక్కకు పెట్టాలని భావిస్తోంది. మూసీ ప్రక్షాళన అంశం మరుగున పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
నిధులు కేటాయించండి
హైదరాబాద్ లోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి తెలిపారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు ఉండవని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు.
Post Comment