Telangana : తెలంగాణలో దర్యాప్తులు స్పీడప్...
తాము కేవలం మాటలు మాత్రమే చెప్పం. అన్నింటిని వెలికితీస్తాం.. బీఆర్ఎస్ నేతల బాగోతాలను బయటపెడతాం అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చెప్పారు. చెప్పినట్టుగానే విచారణ కమిషన్‌లకు ఆదేశించారు. ఇప్పుడు ఆ విచారణలు మొదలయ్యాయి.ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వద్దాం.. ఈ ప్రాజెక్ట్‌లోని మూడు కీలక బ్యారేజ్‌లు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి. మేడిగడ్డ కుంగిపోయింది. ప్రస్తుతం అక్కడ రిపేర్లు కూడా కొనసాగుతున్నాయి.
జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణలో నోటీసులు.. విచారణలు.. ఆరోపణలు, అనుమానాలపై దర్యాప్తులు. మేడిగడ్డ నుంచి మొదలు పెడితే.. అన్ని శాఖల్లో జరిగిన అవకతవకలపై విచారణలను నడుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇదే నడుస్తోంది. ఇన్నాళ్లు అదిగో.. ఇదిగో అన్న ప్రచారాలు ఇప్పుడు నిజాలవుతున్నాయి.
బట్ అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అనే దానిపై జస్టిస్ పీసీ ఘోష్ హెడ్‌గా ఓ కమిషన్ విచారణ జరుపుతోంది. అయితే ఈ కమిషన్ డెడ్‌లైన్ ఈ నెల 30తో ముగుస్తుంది. మరి విచారణ పూర్తైందా? దీనికి ఆన్సర్ నో అనే చెప్పాలి. నెల రోజులైంది ఈ కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ టైమ్‌లో ప్రాజెక్ట్‌ను విజిట్ చేసింది కమిషన్.. ఇప్పటి వరకు 54 ఫిర్యాదులు అందాయి. అందులో నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అధికారులను విచారిస్తున్నారు. సో విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెప్పాలి. అంటే డెడ్‌లైన్ లోపు విచారణ పూర్తి కాదు. ఇదే విషయాన్ని చంద్రఘోష్ కూడా చెబుతున్నారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేమంటున్నారు ఆయన.. అంటే కమిషన్ డెడ్‌లైన్ ఎక్స్‌డెంట్ అవ్వడం కన్ఫామ్ అనే చెప్పాలి.బట్ జస్టిస్ పీసీ ఘోష్ బ్యారేజీల పరిశీలిస్తూనే.. బాధ్యులపై ఫోకస్ చేస్తున్నారు. ప్లానింగ్, డిజైన్స్, కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు.. టెయిల్ వాటర్, షూటింగ్ వెలాసిటీపై ఆరా తీస్తుంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్స్‌తో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటుంది.
అటు నిర్మాణ సంస్థల ప్రతినిధులపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కమిషన్.. అసలు బుంగలు ఎలా పడ్డాయి? ఎందుకు పడ్డాయి? ఎవరి నిర్లక్ష్యం దీనికి కారణం? ఇలా ప్రతి ఒక్క విషయంపై ఫోకస్ చేస్తుంది కమిషన్.. ప్రస్తుతం అధికారులు, నిర్మాణసంస్థల వరకు వెళ్లింది కమిషన్. మరి ముందు ముందు ఎవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి.నెక్ట్స్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, వాటి కోసం చేసిన అప్పులు.. దీనిపై కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ కూడా దర్యాప్తును స్పీడప్ చేసింది. ప్రస్తుత, మాజీ అధికారులను విచారిస్తూనే ఉంది.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం.. చత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కమిషన్ మెయిన్‌గా ఫోకస్ చేసింది. ఇంధనశాఖ మాజీ కార్యదర్శి అర్వింద్ కుమార్.. మాజీ ట్రాన్స్-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం తాజా, మాజీ ఉన్నతాధికారులకు మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి ఇక ముందు ముందు మరింత మందికి ఈ నోటీసులు, విచారణలు విస్తరించనున్నాయి.ఇక గొర్రెల స్కామ్ అప్‌డేట్ ఏంటో తెలుసా? ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన మాజీ పశుసంవర్థక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ OSD కల్యాణ్‌ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.
మూడు రోజుల పాటు వారిని కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది నాంపల్లి కోర్టు.. మీకు తెలుసుగా.. గొర్రెల పంపిణీలో ఏకంగా 700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ చెబుతోంది. గొల్ల కురుమలకు బదులుగా.. ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్స్‌లోకి నిధులు మళ్లించి డబ్బును దోచేశారు. ఇప్పటి వరకు మొత్తం 10 మంది నేతలను గుర్తించగా.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఏసీబీ విచారణతో మరికొంత మంది పెద్దల పేర్లు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కస్టడీలో ఉన్న వారిలో ఒకరు మాజీ మంత్రి OSD కాబట్టి.. ఆయన మెడకు ఈ కేసు చుట్టుకుంటుందా? అనే అనుమానాలు కనిపిస్తున్నాయి. స్కామ్ అయినా.. అవినీతి ఆరోపణలు అయినా.. అన్నింటి రూట్స్ కూడా బీఆర్ఎస్ పాలనలోనే ఉన్నాయి. అరెస్ట్ అయినవారు.. విచారణతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కూడా అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పెద్దలు, నేతలే ఉన్నారు. మొత్తంగా చూస్తే విచారణ మాత్రం చాలా వేగంగా జరుగుతుంది. మరి ఇవి ఓ ముగింపు దశకు వచ్చే సరికి మరేంత మంది జాతకాలు మారతాయనేది చూడాలి. ఇప్పటికే డొంక కదలడమైతే ప్రారంభమైంది.. ఇదైతే కన్ఫామ్.
పవర్ నోటీసులపై కిం కర్తవ్యం...
6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంతకన్నా ఘోర పరాభవంతో చతికిల బడిన తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు నోటీసులు అందాయి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. ‘విద్యుత్ కొనుగోళ్లలో మీ పాత్ర ఏమిటి’ అని పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 2024, జూన్ 30వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందాలపై అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ పాత్రపై కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. లోగుట్టుపై ఉన్న సందేహాలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని కమిషన్ పేర్కొంది. విద్యుత్ ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు అర్వింద్, ఎస్‌కే.జోషి, సురేశ్ చందా, అజయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. జూన్ 15 వరకు తాము వివరణ కోరామని, కేసీఆర్ గడువు కోరడంతో జూన్ 30 వరకు పెంచామని తెలిపారు.పవర్ కమిషన్ నోటీసులపై బీఆర్‌ఎస్ నేతలు స్పందించినట్లు తెలుస్తోంది. జూన్ 30వ తేదీలోపు సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఈమేరకు కేసీఆర్ గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఈమేరకు అధికారుల నుంచి పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూన్ 30 వరకు కాకుండా జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కమిషన్‌ను కోరారు.కేసీఆర్ ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోయినా.. అసంపూర్తిగా ఉన్నా.. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈమేరకు తాజా నోటీసుల్లో కమిషన్ స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు కేసీఆర్‌కు నోటీసులు అందడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కవిత తిహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ క్రమంలో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన నోటీసులు రావడంత కలవర పెడుతోంది .బీఆర్‌ఎస్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి, తాజా నోటీసుల నేపథ్యంలో మరికొందరు అధికార కాంగ్రెస్‌తోపాటు, కేంద్రమో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీకి భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో పార్టీ వీడేందకు చాలా మంది సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
Post Comment