Telangana I చెత్త మనుషులు
నిత్యం లక్షలాది టన్నుల చెత్త భాగ్యనగరం నుంచి ఊరు బయటకు వెళ్తోంది. నిజానికి చెత్త మనుషులు ఎవరు!? చెత్తను తయారు చేసే మనమ !? చెత్తను తీసుకువెళ్లే వాళ్ళ!? ఉదయాన్నే విజిల్ ఊదుకుంటూ వచ్చే మనసున్న మనుషులపై జయ భేరి ప్రత్యేక కథనం
జయభేరి, హైదరాబాద్ : అయ్యవారి జీతం అమ్మవారి పసుపు కొమ్ములకే సరిపోయింది అన్నట్టుగా చెత్త సేకరణ చేసే జీవితాలు కష్టాలు కన్నీళ్లు వంతే అయిపోతుంది... హైదరాబాద్ అంటేనే కనీసం కనికరం లేని మనుషులు ఇక్కడ మనకు నిత్యం తారస పడుతుంటారు. అలా అని అందరిని కలుపుకుపోతే సరికాదు ఎక్కువ శాతం ఇలాంటి వారే మనకు కనిపిస్తుంతుంటారు. ఇక గల్లి గల్లి తిరుగుతూ హైదరాబాద్ నగరంలో పొద్దున్నే గట్టిగా విజిల్ ఊదుకుంటూ వచ్చే సత్తా సేకరణ మనిషి నీ కదిలిస్తే కష్టాలు కన్నీళ్లే తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కరోజు రాకపోతే ప్రతి ఇంటిలో చెత్త ఒక డంపు యాడ్ గా మారిపోయే ఈ భాగ్య నగరంలో చెత్త సేకరణ చేసే కుటుంబాలు ఇంకా దారిద్యరేఖన జీవితాలు వెల్లదీసుకుంటున్నారు. హైదరాబాదులో చెత్త సేకరణ చేసే వాళ్లు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వాళ్లే ఈ పనికి తలవంచి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకొచ్చింది అని అంటే మేం చేసిన సర్వేలో ఎక్కువ శాతం అనగా నూటికి నూరు శాతం ఈ కులాల వాళ్లే ఈ వృత్తిని ఎంచుకోవడం గమనార్హం. ఆర్థికంగా సామాజికంగా ఇంకా చీదరించుకునే ఈ సమాజంలో ఇలాంటి పని కాక ఇంకా వారికి ఏం పని దొరుకుతుంది అనే విధంగా వాళ్లు ఈ వృత్తిని ఎంచుకోవడం వెనక ఉన్న వాళ్ళ స్థితిగతులను పరిశీలిస్తే కంట్లో కన్నీళ్లు ఆగవు..
గతంలో వీరికి చెత్త సేకరణకు ప్రభుత్వం అందించిన వెహికల్స్ చాలా ఈజీగా చెత్తను వేయడానికి ఉండేవి. కానీ ఇప్పుడు రాంకీ సంస్థ తీసుకున్న తరువాత చెత్త సేకరించే వెహికల్స్ కి పెద్ద డబ్బా పెట్టి వాటిని మూసి వేసే విధంగా చెత్త సేకరణల బండ్లను తయారు చేశారు. అయితే ఈ వెహికల్స్ పై చెత్తను వేయడానికి చాలా కష్టపడి పైన వేయాల్సి వస్తుందని వాపోతున్నారు గల్లి గల్లి తిరుగుతూ చెత్త సేకరించే ఆయా కుటుంబాలు.. ఆయా కుటుంబాలు తన భార్య కొడుకులు తను అందరూ కలిస్తేనే పూట గడుస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్మ కాళీ చెత్త సేకరించే కుటుంబాల్లో ఎవరికైనా జ్వరము ఒళ్ళు నొప్పులు వస్తే భారమంతా మిగతా వ్యక్తులపై పడటం అలవాటుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి వారాంతంలో ఒక్కరోజైనా సెలవు కావాలని ప్రాధేయపడుతున్నారు. అంతేకాదు గతంలో చెత్త సేకరించే బండ్లు చాలా వెడల్పుగా ఉండేవని, రెండు మార్లు డంప్యాడ్ లో వేసేస్తే ఆ రోజుకు పని పూర్తి అయ్యేదని కానీ ఇప్పుడు ఇచ్చిన చెత్త సేకరణ బండ్లు వల్ల నాలుగు ఐదు సార్లు డంప్ యాడ్లకు వెళ్లి రావలసి వస్తుందని దీని ద్వారా డీజిల్ ఖర్చు విపరీతంగా భారం పడుతుందని దిగులు చెందుతూ ప్రాధేయ పడుతున్నారు. వారి కష్టాలు కన్నీళ్లు జయభేరి న్యూస్ కు వివరిస్తూ మాకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే చెత్తను తయారు చేస్తూ ఇంట్లో మనం చేసే ఈ పనిని కాస్త జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఒక రోజులో కనీసం మనం చెత్తను వేయడం తగ్గిస్తూ అవసరానికి సరిపడా ఆహార పదార్థాలను తయారుచేసుకొని తద్వారా ఎక్కువ చెత్తను వేయకుండా ఉంటే మనం కూడా వారికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అవసరానికి మించి వండుకోవడం తినకుండా వాటిని పాడు చేయడం వెంటనే చెత్త డబ్బాలో వేయడం ఇలా చేయడం వల్ల మన ఇల్లే ఒక చెత్త డంప్ యాడ్ గా మారిపోతుంది. దీని ద్వారా మనము అనారోగ్యం పాలవుతూ చెత్త సేకరణ చేసే వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాళ్ళం కూడా అవుతాం.. మారుతున్న కాలానికి తగ్గట్టుగానే మన ఆలోచనలను అలవాట్లను మార్చుకునే మనం చెత్తను పోగు చేసే విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడదాం. చెత్త మనుషులం మనమే కాస్త జాగ్రత్త పడదాం...
... కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్
Post Comment