Telangana I కనించని కుట్రలో తెలంగాణ పాటమ్మ
కనుమరుగైపోతున్న తెలంగాణ కవులు కళాకారుల ఆత్మ గోసలపై, ఎందుకు రాయాలి పాట ఎందుకు పాడాలి పాట అన్న అందెశ్రీ నోట విన్న ప్రతి మాట ఒక తూటాగా పేలబోతుంద!? 'జయ భేరి'... కౌంటర్ విత్ కడారి ప్రత్యేక కథనం...
జయభేరి, హైదరాబాద్ :
గులాబీముళ్ళ పొదలో చిక్కెను తెలంగాణ పక్షి...
గుండె బాధతో కుమిలిపోతూ
ఎక్కి ఏడ్చే తల్లి.....
కడుపు దహించుకుపోయే.. పొడుపు కత్తే రాక్షస రతిలో అర్థనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి.... ఎడ బాయె!?
ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం....
ఘాటెక్కిన పదాలతో రాసిన కవులు...
పోటెత్తిన పాటలతో గజ్జ కట్టి ఆడిన కళాకారులు మూగ బోయేన!?
అయ్యో నీవా నువ్వు అమ్మోనీవా అని పాడిన గళాలు మద్యానికి బానిసలాయన!?
ఈ రాష్ట్రం ఎట్లా పోతేనేం మాకెందుకులెండి అని ఆలోచిస్తున్న అన్యాయాలు, స్వార్థాలు, అధికారాలు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాయి..
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పాటమ్మ కనుమరుగైపోయింది.
పరాయి పాలనను ఎదిరించడానికి గళం ఎత్తి గర్జించిన కవుల కంఠం మూగబోయింది..
ఒక్కమాటలో చెప్పాలంటే కలం అమ్ముడుపోయింది, పాటమ్మ గడీల కోటలో బందీగా మూలుగుతుంది.
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అన్న ఆ గొంతు ఎక్కడ బాయేనో!? పదవి మోజులో పడి మౌనం దాల్చింది!?
ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అని గర్జించిన గొంతు తాగుబోతుగా మారింది...!?
నిరుపేద కళాకారులు అన్నమో రామచంద్రా ఆని ఉపాధి కోల్పోయి దిక్కులేని పరిస్థితుల్లో నేడు పాటను నమ్ముకొని, అమ్ముకొని బతుకును వెల్లబుచ్చుకుంటున్న వైనం తెలంగాణ రాష్ట్రంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది...
రాష్ట్ర సాధన కోసం మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిని పోషించిన పాటమ్మ నేడు ఘడీల కోటలో బానిస బతుకు వెల్ల తీసుకుంటుంది. పరాయి పాలనపై కలం, గళం ఎత్తి మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు మాకే అంటూ గర్జించిన పాటమ్మను పెంచి పోషించిన ఆ రాక్షస సమూహాకల నర కింకరులే నేడు కలాన్ని గళాన్ని శాసిస్తూ, అధికార మదంతో కన్ను మిన్ను కానక గడీల కోటలో పాటమ్మను చరలో బంధించింది.
పల్లె కన్నీరు పెడుతుందని నాడు చలించిన మనసుతో రాసి, పాడినా ఆ ప్రజాకవి.. ఎక్కడాబాయే!?
రాష్ట్రం సాధించిన తరువాత ఎమ్మెల్సీ పదవి దక్కిన పిదప మౌనం ఎందుకు వహించాడో!? ఆయనే సమాధానం చెప్పాలి. గజ్జ కట్టి ఆడి అయ్యో నివా నువ్వు అమ్మోనివా అన్న ఆ గొంతు ఇప్పుడు అధికారం తో తులతూగుతూ పాటమ్మ ను ఎందుకు నిద్రపుచ్చారు.? కేవలం అధికారం కోసమే! పదవుల కోసమే! బానిసలైన తెలంగాణ కవుల కళాకారులకే ఈ నిందలు, కాదు కాదు పచ్చి నిజాలు భరించాల్సి వస్తుంది. కడుపు మండిన నిరుపేద కళాకారుల ఉసురు మామూలుగా పోదని ఆవేదన వెల్లబుచ్చుతున్న నిరుపేద కళాకారుల గోస ఇది.
పాటమ్మను నమ్ముకున్న ప్రజా కవులు కళాకారులు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత ఏడ పోయిండ్రో ఎవ్వరికీ తెలువదు. వ్యవ సాయాన్నే నమ్ముకొని బతుకుతున్నరు. కొంతమంది కవులు కళాకారులు. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఉనికిని సంపాదించుకొని గర్జించే గాంభీర్యాన్ని వదులుకొని కరెన్సీ కట్టలకు అధికారం మధానికి బానిసలై జీవచ్ఛవంలా బతుకు వెల్లదీసుకుంటున్న వైనం సొంత రాష్ట్రంలో కనిపిస్తోంది. స్వార్థం కమ్మిందో ఏమో అధికారం తో కనులు మూసుకుండ్రో ఏమో... సొంత రాష్ట్రంలో కవులు కళాకారులు ప్రశ్నించే తత్వాన్ని బొంద పెట్టుకున్నరు. కాదు కూడదు అని ప్రశ్నిస్తే చెరసాలలో మగ్గి బతుకును వెల్లదీసుకుంటున్న వైనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.
నాడు ప్రశ్నిస్తే మెచ్చుకున్న ఆపెద్ద మనుషులే, నేడు ప్రశ్నిస్తే సంకెళ్ళతో బంధించే స్థితికి రావడానికి కారణం అధికారమే!? తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల సాక్షిగా తెలంగాణ పుడమిపై ఉద్యమ గళాలు ఊపందు కున్నాయి. కానీ స్వరాష్ట్రం సాధించిన తరువాత మేము ప్రజా కవులము అని చెప్పుకున్న ఆ పెద్ద మనుషులే స్వార్థానికి మరిగి రాయడం, పాడడం ఆపేసాయి. ఇది చాల మోసం. మానవ మనుగడ ఉన్నంతకాలం పాటమ్మ సజీవంగానే ఉంటుంది అనేది నగ్నసత్యం. కానీ స్వార్థంతో కపట నటన వేషాలతో ఎదిరించి గర్జించి పాడిన పాట ఇప్పుడు గడీల పాలనలో బందీగా మారి భజనలు చేస్తోంది... కనిపించే కుట్రలో తెలంగాణ బందిగా మారి కలం అమ్ముడుపోయింది. గళం గొంతును సవరించుకొని రూటు మార్చుకుంది. అమ్ముడుపోయిన కవులు కళాకారుల బ్రతుకు చిత్రాన్ని ఈ సమాజం కనిపెడుతూనే ఉంది.
నాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవులు కళాకారులకు మంచి గిరాకీ ఉండేదని విన్నాం చదువుకున్నాం. మళ్లీ నేటి తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులకు ఒక సంస్కృతిక శాఖను ఏర్పాటు చేసి దానిలో తమకు నచ్చిన వారికే అవకాశం కల్పించి ప్రభుత్వానికే వత్తాసు పాడుతూ, ప్రజల్లోకి వెళ్లి తమ గొప్పదనాన్ని చాటండి అని హుకుం జారీ చేస్తూ వారిని బానిసలుగా మార్చుకున్నది ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా!?
కొంతమంది కళాకారులు కలాన్ని, గలాన్ని నమ్ముకుని స్వతంత్రంగా బ్రతుకును వెల్లదీస్తున్నప్పటికీ వారిపై ఎన్నో కేసులు మానసిక వేదనకు గురి చేసే పనులు ఈ రాష్ట్రంలో నిత్యకృత్యం అయిపోయాయి. కాదు కూడదు అని ఎదిరిస్తే ఆ కలం మూగబోతుంది. ఆ గళం అమ్ముడు పోతుంది.
ఇదెక్కడి తెలంగాణ అంటూ గళం ఎత్తి గర్జించాల్సిన అవసరం ఈ పేరు ఉన్న ప్రజా కవులకు లేదా!? ప్రజాహితాన్ని కోరుకొని ప్రజల్లో నుంచి పుట్టిన కవుల కళాకారుల బాధ్యత కాదా!? పాటమ్మ తోనే ప్రస్థానం కొనసాగించి తమ ఉనికిని ప్రకటించుకున్న ఆ పెద్ద మనుషులని పిలిపించుకునే కవులు మీరు ఎక్కడ పోయారు!? పదవులు వచ్చినంక కళాన్ని మూలకు పడేశారా? గళానికి తాగుడు నేర్పించార!? ప్రభుత్వ పాలనపై దిక్కరించే స్వరం కనుచూపుమేరలో కనిపించడం లేదు! కారణం దొరల పెత్తనం!? దోపిడీ ప్రభుత్వం!? నిజాం ప్రభుత్వం పై నాడు తిరగబడిన పాటమ్మ నేడు ఈ పాలనపై తిరగబడాల్సిన అవసరం లేదా!? మౌనం ఎందుకు దాలుస్తుంది!? నిరుపేద కళాకారుల ఉసురు ఇంకెంతకాలం పంచుకుంటారు!?
ప్రశ్నించే తత్వాన్ని ఎందుకు చంపుకుంటున్నారు!?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం పదవులను అనుభవిస్తున్న కళాకారులు మీరే సమాధానం చెప్పాలి. తెలంగాణ అంటేనే కవులు కళాకారులకు పుట్టినిల్లుగా చరిత్రలో లిఖించుకున్న ఘనత ఈ తెలంగాణ పుడమిది. కానీ స్వరాష్ట్రంలో పాటకు పట్టాభిషేకం కడుతూనే ఇంకోవైపు అదే పాటను మహాప్రస్థానంలోకి తీసుకెళ్లే నయవంచకులు ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇదేమి విడ్డూరం కాదు. తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతిక శాఖలో ఉద్యోగం దొరకలేదని ఎంతోమంది నిరుపేద నిజమైన కళాకారులు ఆవేదన ఈ ప్రభుత్వానికి పట్టదా!?
కాలికి గజ్జ కట్టి భుజాన గొంగడి వేసుకొని ఎవరో రాసిన రచయితల పాటలను కాపీ కొట్టిన ఆ పెద్ద మనిషి ప్రజా ప్రతినిధి.!? అదే పెద్దమనిషి వీడు మోసగాడు అని చెప్పి పాట రూపేనా ప్రజల్లోకి వెళ్లి మళ్లీ నాలిక కరుచుకొని మీకు బానిసలు కాలేదా!? అంటే దీని అర్థం పాటమ్మ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా!? కూటి కోసం, కూలి కోసం పట్టణంలో తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన కవులు కళాకారులకు చివరకు మిగిలిందే మిటి!?
నిర్భాగ్యులుగా మిగిలి సమస్యల సుడిగుండంలో సందేహాల వలయంలో ఆత్మ గోషలు అధికార ప్రభుత్వానికి వినపడటం లేదా!? గుండెలు ఘోషిస్తున్న మీ కలం మీ గళం రాయడం పాడటం లేదు ఎందుకని!? ఇకనైనా ఆత్మలోకనం చేసుకోండి హీనమైన పాపాన్ని మూటగట్టుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోకండి!? అబద్ధాలతో స్తోత్రాలతో వంచనలతో స్వార్థాలతో అనుకూల దుష్ట ప్రచారంతో ఆత్మస్లాగణాలతో రాష్ట్రం మీద పడి బతుకుతున్న కవి వరెన్యులై బ్రతుకుతున్న మీరు, బలై పోయిన రాష్ట్రా కవులు కళాకారులకు సమాధానం చెప్పాలి!? కవిత్వపు కాలం అంతమైపోయిందా!? దిక్కరించి గర్జించిన పాటమ్మ ప్రస్థానం ముగిసిపోయిందా!?
సొంత రాష్ట్రంలో మళ్లీ కవిత్వాన్ని సాహిత్యాన్ని పాఠమును బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఈ నవ యుగ నిర్మాతలు మళ్లీ గర్జించి కదం తొక్కి శ్రీశ్రీ భావజాలాన్ని పునికి పుచ్చుకోవాలి!
పాటమ్మను బంధిస్తే పుడమిని చీల్చుకొని మొలిచే మొక్కై పుడుతుంది పాట. తెలిసి స్వార్థానికి అధికారానికి అలవాటు పడి అనగదొక్కాలని చూస్తే గర్జించి మీరు కట్టుకున్న అందమైన మేడలను కూల్చేస్తుంది కలం నుండి జాలువారిన పాట.... ఆ పాటకు నిరుపేద కళాకారులకు అవకాశం ఉపాధి కలగాలని సదుద్దేశంతో అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం. కవులను కళాకారులను గౌరవించుకోవడం బాధ్యతగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వాళ్లను రాజకీయంగా అస్త్రాలుగా మనలుసుకోవడం దేనికి సంకేతం? ప్రజలను సమాజాన్ని ఉత్తేజ పరచాలి స్పష్టమైన వైఖరిని తెలిపే లాగున నడవాల్సిన పాఠం మా రాజకీయ రంగు పులుముకుని జెండాల చాటున బందీగా మారుతుంది... ఎందుకు రాయాలి పాట ఎందుకు పాడాలి పాట అన్న అందెశ్రీ నోట విన్న ప్రతి మాట ఒక తూటాగా పేలబోతుంద!? ఇది కవులను కళాకారులను ఆలోచింపచేసే కథనం మాత్రమే. ఎవరిని కించపరిచినట్టు ఉద్దేశం నాకు లేదు!
పాట దారి మర్లుతున్న ఈ తరుణంలో మల్లొకసారి తెలంగాణ కవులు కళాకారులు మేల్కోవాలని సదుద్దేశంతో.....
... కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్
Post Comment