Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు
బలమైన నేతలను బరిలోకి దించి.. ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
జయభేరి,
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ నేతల జంపింగ్, ఎంపీ అభ్యర్థుల ప్రకటన. అయితే ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి హరీశ్ రావు పోటీ చేస్తారన్న వార్తలపై ఆయనే స్వయంగా స్పష్టంగా స్పందించారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటాలని మూడు ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అత్యధిక సీట్లు గెలవడం తమ పాలనపై రెఫరెండం అని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు మరిన్ని సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక.. బీజేపీ కూడా క్షేత్రస్థాయి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే.. బలమైన నేతలను బరిలోకి దించి.. ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
మెదక్ ఎంపీ స్థానం నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై హరీష్ రావు స్పందించారు. మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. అది పూర్తిగా అబద్ధమని.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. తనకు ఎంపీ టికెట్ విషయంలో పార్టీలో చర్చ జరగలేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. మిగిలిన ఎంపీ అభ్యర్థులను కూడా ఒకటి రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని చెప్పారు. మెదక్ నుంచి ఎవరు పోటీ చేసినా వారి విజయానికి కృషి చేస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. దీంతో ఆయనపై వస్తున్న వార్తలకు తెరపడినట్లే.


