చక్రం తిప్పిన పొంగులేటి..! ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి బ్యాగ్రౌండ్ తెలుసా...?
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి
- ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఎంతో కాలంగా కసరత్తు కొనసాగుతోంది. చివరిగా రామసహాయం రఘురామిరెడ్డికి టికెట్ దక్కింది. అయితే ఆయన కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది.
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఎవరు పంతం నెగ్గించుకుంటారు..? ఇలా గత కొంతకాలంగా జోరుగా చర్చ సాగింది. తెరపైకి ఎన్నో పేర్లు వచ్చినప్పటికీ…. ఫైనల్ గా మంత్రి పొంగులేటి వియ్యంకుడైన రామసహాయం రఘురామిరెడ్డి కి సీటు ఖరారైంది. గడువుకు ఒక్కరోజు ముందు పేరును ప్రకటించగా… ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. రఘురామిరెడ్డి కుటుంబానికి బలమైన పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది.
రామసహాయం సురేందర్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత. చాలా రోజులుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇయన్ను ఆర్ఎస్ గా పిలుస్తుంటారు. పూర్వ వరంగల్ జిల్లా డోర్నకల్, మహబూబా బాద్ ప్రాంతంలో ఆయనకంటూ పెద్ద పేరే ఉంది. సురేందర్ రెడ్డి 30 ఏళ్ల వయస్సులో "మర్రిపెడ" సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మహబూబ్ బాద్ సిట్టింగ్ ఎంపీ మధుసూదనరావు మరణం వలన 1965లో జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచారు. తరువాతి ఎన్నికల్లో అంటే 1967లో కూడా ఎంపీగా గెలిచారు. డోర్నకల్ కు చెందిన రామసహాయం రాఘవరెడ్డి మరియు దామోదర్ రెడ్డి అన్నదమ్ములు. దామోదర రెడ్డికి పిల్లలు లేరు. రాఘవరెడ్డికి కొడుకు సురేంద్ర రెడ్డి, కూతురు భారతి దేవి, మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేంద్ర రెడ్డి... సోదరి భారతి దేవి డోర్నకల్ కే చెందిన నూకల రాంచంద్రారెడ్డిని వివాహం చేసుకున్నారు. నూకల రామచంద్రారెడ్డి డోర్నకల్ నుంచి 1957-1972 వరుసగా నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1972లో వెంగళరావు మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ 1974 జూలైలో గుండెపోటుతో మరణించారు. నూకల రామచంద్రారెడ్డి పీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని పీవీ గారికి సన్నిహిత మిత్రుడు. కాంగ్రెస్ గ్రూపుల్లో నీలం సంజీవ రెడ్డి వర్గంలో ఉండేవారు.
రామ సహాయం సురేంద్రరెడ్డి వరంగల్ దగ్గరి ప్రాంతమైన వడ్డేపల్లి భూస్వాములు పింగిళి ఇంద్రసేన రెడ్డి కూతురును పెళ్లి చేసుకున్నారు. విజయపాల్ రెడ్డికి ఒక్కరే కూతురు. మూడు ఆస్తులు సురేంద్రరెడ్డికి కలిసొచ్చాయి. ఇక ముప్పై సంవత్సరాల లోపే సురేంద్ర రెడ్డి మర్రిపెడ సమితి అధ్యక్షుడయ్యారు. 1965లో మహబూబాబాద్ ఎంపీ ఇటికాల మధుసూదనరావుగారు మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో మహబూబాబాద్ ఎంపీగా సురేంద్ర రెడ్డి గెలిచారు. 1965 నాటికి కాసు బ్రహ్మానందరెడ్డి గారి మంత్రి వర్గంలో రామసహాయం సురేంద్ర రెడ్డి బావ నూకల రామచంద్రారెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేవారు. 1965 ఉప ఎన్నికల్లో రామచంద్రారెడ్డి తన బావమరిది సురేంద్ర రెడ్డికి సులభంగానే కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోగలిగారు.
సురేందర్ రాజకీయ ప్రస్థానం
-1965 ఉప ఎన్నికల్లో మహబూబా బాద్ ఎంపీగా గెలిచిన సురేంద్ర రెడ్డి 1967లో మహబూబ్ బాద్ నియోజకవర్గం రద్దు కావటంతో వరంగల్ నుంచి పోటీచేసి మరోసారి ఎంపీగా గెలిచారు.
-1971లో మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితి(టిపిఎస్) పోటీచేసింది. సురేంద్ర రెడ్డి కూడా తెలంగాణ ప్రజాసమితిలో చేరారు. టిపిఎస్ తరుపున వరంగల్ సీట్ ను యస్.బి.గిరి అనే నాయకుడికి ఇచ్చారు. సురేందర్ రెడ్డి సొంత నియోజకవర్గం డోర్నకల్ మరియు పట్టున్న మహబూబ్ బాద్ ఖమ్మం లోక్ సభ పరిథిలో కారణంగా చెన్నారెడ్డి ... సురేందర్ రెడ్డిని ఖమ్మం నుంచి పోటీ చేయమని అడిగారు కానీ ఆయన తిరస్కరించారు. దానితో టిపిఎస్ టికెట్ చేకూరి కసయ్యకు ఇచ్చారు ఆయన కాంగ్రెస్ లక్ష్మీకాంతమ్మ మీద ఓడిపోయాడు.
- రామచంద్రారెడ్డి మరణంతో 1974లో జరిగిన ఉప ఎన్నికల్లో డోర్నకల్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత సురేంద్ర రెడ్డి వరుసగా 1978,1983,1985 ఎన్నికల్లో డోర్నకల్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 మరియు 1991 ఎన్నికల్లో వరంగల్ నుంచి ఎంపీగా గెలిచారు. 1996 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చందూలాల్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 65 సంవత్సరాల వయస్సులోనే రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు.
హీరో వెంకటేష్ కుటుంబంతో బంధుత్వం
సురేంద్ర రెడ్డికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కొడుకు రఘురామిరెడ్డి. సురేందర్ రెడ్డి పెద్ద కూతురు అమెరికాలో ఉంటారు. చిన్న కూతురు డాక్టర్ ఇందిరా అపోలో హాస్పటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. రఘురామిరెడ్డి.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్మేట్. రామసహాయం సురేంద్ర రెడ్డికి రఘురామిరెడ్డి ఒక్కడే కుమారుడు. రఘురామిరెడ్డికి వినాయక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇద్దరు కొడుకులు. రఘురామిరెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి... హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ను వివాహం చేసుకున్నాడు. రఘురామిరెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని వివాహం చేసుకున్నాడు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రామసహాయం రఘురామిరెడ్డి పాలేరు నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ కుదరలేదు. ఇక పొంగులేటిని కాంగ్రెస్ లోకి తీసుకురావటంలో కూడా రామసహాయం పావులు కదిపారనే టాక్ కూడా ఉంది. బలమైన కుటుంబ నేపథ్యం ఉండటమే కాకుండా... తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ వాడిగా చాలా ఏళ్లు పని చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కీలక నేతగా పనిచేసిన చరిత్ర ఉంది. దీనికితోడు ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా కూడా ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా రఘురామిరెడ్డికి టికెట్ కేటాయింపులో కీలకంగా పని చేశాయన్న టాక్ కూడా వినిపిస్తోంది.
Post Comment