ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందించాలి..

అత్యుత్తమ సేవలతోనే మంచి గుర్తింపు... జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, హుజురాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం సందర్శన

ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రైవేటు దవాఖాన కంటే ప్రభుత్వ దవాఖానల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అత్యుత్తమ సేవలతోనే ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు.

ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందించాలి..

జయభేరి, హుజురాబాద్ :
ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య అధికారులు, సిబ్బంది సేవలందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు రెండు గంటల పాటు వైద్య సేవలను పర్యవేక్షించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. డాక్టర్లు సిబ్బంది మంచిగా సేవలందిస్తు న్నారా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ కేంద్రం, ఆపరేషన్ థియేటర్ మందులు నిల్వ ఉంచే గది, మెటర్నిటీ వార్డు, లేబర్ రూమ్ తో పాటు పలు వార్డులను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలతోనూ మాట్లాడారు. వైద్య సేవలకు సంబంధించి వైద్యాధికారులకు దిశా నిర్దేశం చేశారు. 

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రైవేటు దవాఖాన కంటే ప్రభుత్వ దవాఖానల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అత్యుత్తమ సేవలతోనే ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా కృషి చేయాలని సూచించారు. రోగులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిం చాలని పేర్కొన్నారు. మందులకు కొరత లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని, ఎమర్జెన్సీ మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

ఇంకా అదనంగా వైద్య సిబ్బందిని నియమించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు. నిరంతరం విద్యుత్ ఉండేలా చూసుకోవాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షణ జరపాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. దవాఖానకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని వైద్యాధికారులకు సూచించారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రోజుకు ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 500 మందికి పరీక్షలు చేస్తున్నామని సిబ్బంది వివరించారు. 

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

అదేవిధంగా ఇంక్యుబేటర్ గదిని సందర్శించి అందులో చికిత్స పొందుతున్న చిన్నారులను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సేవల్లో నిర్లక్ష్యం పనికిరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎల్లవేళలా ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ బీ చందు, ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ రాజేందర్ రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో సునీత, వైద్యులు శ్రీకాంత్ రెడ్డి, వాణిలత, సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Read More పదవి ఉన్న లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతా