పల్లె ప్రకృతి వనమా..డంపింగ్ యార్డ్ కు నిలయమా..?
గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రతి ఊరిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డులకు నిలయాలుగా మారుతున్నాయి. జనాలు ఉదయాన లేదా సాయంత్రము సేద తీరడానికి ఆహ్లాదమైన వాతావరణం కోసం ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాలు నిర్లక్ష్యానికి గురై లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రజాసంపదను దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలోకి సేద తీరడానికి వెళ్లిన జనం చెత్తను చూసి జడుసుకుంటున్నారు.
అదేవిధంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నర్సరీల్లో పెంచుతున్న మొక్కలకు ఆలనా, పాలనా లేకుండా పోవడంతో అవి ఎండిపోతున్నాయి. ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలు అధికారుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైపోతున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచే కార్యక్రమంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం పర్యావసనంగా మొక్కలు ఎండిపోతున్నాయని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.


