Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

దేశమే గెలిస్తే ఎవరు ఓడినట్లు? దేశమే ఓడితే ఎవరు గెలిచినట్లు?

Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ దశలో పార్టీల పరస్పర విమర్శలు అనుచిత ఉచితాల మేనిఫెస్టోలు, పరస్పర రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చూస్తుంటే "దేశమే ఓడిపోతే గెలిచేది ఎవరు? దేశమే గెలిస్తే ఓడేది ఎవరు?"అన్న భారత ప్రప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలు గుర్తొస్తున్నాయి.

  • జయభేరి, హైద‌రాబాద్ : దేశ శాశ్వత ప్రయోజనాలను పక్కనపెట్టి,ప్రజల ఉజ్వల భవిష్యత్తును తాకట్టుపెట్టి తాత్కాలిక ఎన్నికల ప్రయోజనాల కోసం దేశవ్యాప్తంగా అన్ని సాంప్రదాయ పార్టీలు అనుచిత ఉచితాల పేరు మీద ప్రజలు కట్టే పన్నుల డబ్బులను పందేరం చేస్తున్నాయి. అలాగే కార్పొరేట్ సంస్థల వ్యక్తుల కు కొమ్ము కాస్తూ రైట్ ఆఫ్ ల పేరు మీద లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంచి పెడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్ని జిమ్మిక్కులు అయినా చేసి వ్యక్తిగతంగా తాము, అధికారం కోసం పార్టీలు గెలవాలని  కోరుకుంటున్న సందర్భంగా నెహ్రూ మాటలు మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది.
  • "గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం" అన్న పాటను పాడుకున్న మనమే " "గాంధీ పుట్టిన దేశమా ఇది. నెహ్రూ కోరిన సంఘమా ఇది" అని ప్రశ్నించే పాటను కూడా పాడుకోవలసిన పరిస్థితులు పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని పార్టీ కంటే దేశం ముఖ్యమనే విలువలను రోజురోజుకు కాల రాస్తూ విలువలకు వలువలు విప్పుతూ ఆట నియమాలు మార్చే సంగతి అటుంచి ఆటగాళ్లు మాత్రమే మారుతున్న ఎన్నికల సందర్భం ఇది. దేశవ్యాప్తంగా డెంగ్యూ,చికెన్ గునియా జ్వరాల వ్యాప్తి వేగంగా జరుగుతుంది.దాంతో పాటు అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు మన దేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్ సంబరాల జ్వరం ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు తెలంగాణ చత్తీస్ గడ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరం రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూలు వచ్చింది.నవంబర్ 30 నాటికి ఈ ఐదు రాష్ట్రాలలో విడతల వారీగా పూర్తవుతుంది. ఒకవైపు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపితో సహా తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి తో సహా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాలు వెల్లడించాయి. అలాగే మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలను వివరిస్తూ మేనిఫెస్టోలు విడుదల చేశాయ. దేశంలో పోలింగ్ జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జ్వరం కరోనా వైరస్ కంటే వేగంగా పరిగెడుతుంది.
  • ఒకరి కంటే ఒకరు...
    2024 జనవరి మొదటి రెండవ వారాలలోపే తెలంగాణ రాష్ట్రంతో పాటు చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్,మిజోరం రాష్ట్రాల అసెంబ్లీల కాల ముగుస్తుంది. అందుకే ఈ సంవత్సరానికి ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయని ముందే ఊహించిందే.ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటికే ఎన్నికల అస్త్ర శస్త్రాలను పదును పెట్టుకుంటూ సిద్ధం చేసుకుంటున్నాయి.మేమేమి తక్కువ తినలేదని దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి కూడా ఆయా రాష్ట్రాలలో తమ రాజకీయ కాలాపాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పార్టీ ప్రచారంలో తల మునుకలై ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఆయన వరస పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే జాతీయ పార్టీల ప్రధాన నాయకుల వరస వలస పర్యటనలు జరుగుతూనే ఉన్నాయి.అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో వరస ఎన్నికల సభలలో ప్రసంగిస్తున్నారు. అలాగే మరొక జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏకంగా హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసి సమావేశమే నిర్వహించింది.అంతేకాకుండా అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసింది.ఉచిత హామీల తాయిలాలు గుప్పించే మేనిఫెస్టో ప్రకటనలో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ ముందుంది.మూడు పువ్వులు ఆరు కాయల సామెతను గుర్తు చేస్తూ 6 గ్యారంటీలు 12 హామీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇప్పటికే తన మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ గ్యారెంటీలకు తమ పార్టీ అధిష్టాన వర్గం మద్దతు ఉందని చెప్పడానికి తెలంగాణ ఇచ్చిన దేవతగా వర్ణిస్తున్న సోనియాగాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి వారి ద్వారా ఆ గ్యారెంటీ హామీలను బహిరంగ సభలో ప్రకటింప చేసింది. వాటిని కొనసాగిస్తూనే మళ్లీ రెండో విడత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రామప్ప దేవాలయం లో పూజలు నిర్వహించి అక్కడి నుండే బస్సు యాత్రను ప్రారంభించి ములుగు, పెద్దపల్లి,కరీంనగర్ బహిరంగ సభలలో మాట్లాడారు. కాంగ్రెస్ ఇస్తున్న ఈ గ్యారెంటీలు, హామీలన్నీ తాము ఇప్పటికీ అమలు చేస్తున్న పథకాలకు కొనసాగింపు మాత్రమే తప్ప మరొకటి కాదని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. ఒక్క కొత్త పథకం కూడా కాంగ్రెస్ ప్రకటించలేదని రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది.
  • నేనే గ్యారెంటీ అంటున్న మోడీ!!!
    ఒక్కరోజు తేడాలోనే అక్టోబర్ 1,3 వ తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో వరస పర్యటనలు చేసిన నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పార్టీగా మాత్రమే గ్యారెంటీ ఇచ్చింది కానీ తెలంగాణ సమాజానికి "నేనే గ్యారెంటీ" అని తనకు తానే కితాబు ఇచ్చుకొని గతంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన డీకే బారువా "ఇందిరాయే ఇండియా-ఇండియాయే ఇందిరా" అనే మాటలను గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఇంకా నోటిఫికేషన్ విడుదల కావడానికి సమయం ఉన్నందున ఈ లోపే మరొక రౌండ్ వేయడానికి అమిత్ షా నరేంద్ర మోడీ తో సహా స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి శర్మ తదితరులను ప్రచారానికి దించింది. టిఆర్ఎస్, కాంగ్రెస్,బిజెపిలలో మొదట అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్  రాకముందే ప్రకటించి బిఆర్ఎస్  ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటిస్తే తర్వాతి చర్యగా అక్టోబర్ 15 స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సెంటిమెంటు పరంగా వర్క్ అవుట్ అయిన పూర్వపు కరీంనగర్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నుండి తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజుల్లో అక్టోబర్ 16,17 ,18 తేదీలలో జనగామ ప్రజా ఆశీర్వాద సభల పేరిట వరస సభలతో కెసిఆర్ తనదైన రీతిలో ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగించారు. కెసిఆర్ రెండవ విడత ఎన్నికల ప్రచార సభలు 26 అక్టోబర్ నుంచి మొదలై నవంబర్ 9 వరకు 45 జిల్లాలలో ఇప్పటివరకు పూర్తయ్యాయి.
  • ఎన్నికలప్పుడే ఓడ మల్లయ్యలా?
    గత తొమ్మిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల ఊసే తలవని ప్రధానమంత్రి మోడీ కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి ఇప్పటికే అమలులో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి అప్పజెప్పడం మొదలుకొని పసుపు బోర్డు ఏర్పాటు,గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, దేశవ్యాప్తంగా ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు మొన్నటి నుండే అమలవుతున్న 200 రూపాయల సబ్సిడీ కి తోడుగా కొత్తగా మరొక 100 రూపాయల సబ్సిడీ అదనంగా పెంచారు. "రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా" అన్నట్లు ప్రధానమంత్రి ప్రకటన తర్వాతే యూనియన్ క్యాబినెట్ వీటిని ఆమోదించింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మొన్నటికి మొన్న కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీలకు తోడు మరొక హామీని జతపరిచి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు 14 పథకాలను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా గ్యాస్ బండ సబ్సిడీని బిజెపి 300 కు పరిమితం చేస్తే గృహ వినియోగదారులందరికీ కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదువందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది దానికి తోడు ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు ఇస్తామని కూడా వారు చెప్పారు. దానికి తోడు రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి నెల 2500 జీవన భృతిని కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.ఇక టిఆర్ఎస్ కాంగ్రెస్ మా పథకాలనే నకలు కొట్టింది అని విమర్శిస్తూనే తెల్ల కార్డు కలిగిన కుటుంబాలలో ఉన్న మహిళలకు నెలకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించింది అలాగే రాష్ట్రంలో ఉన్న 93 లక్షల తెల్లకార్డుదారులకు అందరికీ ఐదు లక్షల ఉచిత భీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని ప్రకటించింది. అలాగే గ్యాస్ బండ 400 రూపాయలకు అందిస్తామని బిఆర్ఎస్ ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తమ పథకాలను కాపీ కొట్టిందని విమర్శిస్తుంటే టిఆర్ఎస్ కొనసాగింపును మాత్రమే కాంగ్రెస్ తీసుకుంటుందని ప్రతి విమర్శ చేస్తుంది.
  • కార్పొరేట్లకు రైట్ ఆఫ్ లు సబబేనా?
    పేదలకు ఉచితాలు వద్దా?
    ఈ ఉచిత హామీలను వ్యతిరేకించే వాదనకు వ్యతిరేకంగా దేశంలో మరొక వాదన వినిపిస్తుంది. కార్పొరేట్ సంస్థలకి పలుకుబడి ఉన్న వ్యాపారులకి లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తూ వాటిని రైట్ ఆఫ్ గా పేర్కొంటూ  ప్రజల సొమ్మును పెద్దలకు పందేరం చేస్తున్న ప్రభుత్వాల సంగతి ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ వాదన కూడా నిజమే ఎందుకంటే భూములతో పాటు ఇతర ఉత్పత్తి వనరులు,సంపద అంతా ఒకవైపు కేంద్రీకృతం అవుతున్న సమాజంలో పేద ప్రజల జీవన భద్రతకు అవసరమైన చర్యలు ఆయా ప్రభుత్వాలు చేపట్టాల్సిందే. కానీ అవి శృతి నుంచి రాగానే పడ్డప్పుడు మాత్రమే కష్టాలు వస్తాయి.
  • ఇచ్చిన హామీలు అమలయ్యేనా?
    ప్రస్తుతం కాంగ్రెస్ డిఆర్ఎస్ తోపాటు రేపు బిజెపి ప్రకటించబోయే ప్రజలకు ఇచ్చే ఉచిత హామీల సంగతిని ఒకసారి పరిశీలిస్తే ఇవి అమలు అయ్యేవేనా అని అనిపిస్తుంది. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలకు ప్రతి సంవత్సరం సుమారు 70,000 కోట్ల రూపాయల ఆర్థిక వనరులు అవసరమవుతాయి. టిఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు ఇస్తున్న అమలు చేస్తున్న హామీల కంటే పెంచిన కొనసాగింపుకు కొత్త హామీల అమలుకు మరొక 30 వేల కోట్ల రూపాయలు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం పై పడుతుంది. ఇక బిజెపి హామీల సంగతి తెలిస్తే ఇంకా ఎంత భారం పడుతుంది అనేది సరైన అంచనాకు రావచ్చు.
  • ప్రజాస్వామ్య విలువలతో, అంతర్గత ప్రజాస్వామ్యంతో, ఉమ్మడి రాజకీయ నాయకత్వంతో నడవాల్సిన రాజకీయ పార్టీలు ఏక వ్యక్తి పాలనలో మగ్గిపోతున్నాయి. ఇక ప్రాంతీయ పార్టీలు అన్ని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి.పార్టీ అంటే తామే,తామంటే పార్టీయే అనే విధంగా ప్రాంతీయ పార్టీల వ్యవస్థాపకులు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి ఎన్నికలలో అనుచిత ఉచితాల ఎన్నికల తాయిలాల వరద వెల్లువలా పారనుంది. కేంద్రంలో అధికారంలో బిజెపి పార్టీ తాను మాత్రం మిగతా పార్టీల కంటే తగ్గేదేలే అంటూ ఎన్నికల వాగ్దానాల హామీల మూటను విప్పనుంది. ఈ దశలో రాష్ట్రాల ఖజానాతో ఆర్థిక వెసులుబాటు, సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా ఒకరి కంటే ఒకరు అన్ని వర్గాల ప్రజలకు అనుచిత ఉచిత హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చాయి. ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొత్త హామీలు ఇవ్వనున్నాయి. రాష్ట్రాలలో అభివృద్ధి, మౌలిక వసతులు ఏర్పాటు  విద్య,ఆరోగ్య సేవల మెరుగుదల, యువతకు ఉపాధి, వ్యవసాయాన్ని లాభసాటి చేయడం, అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి కల్పించడం, రోడ్లు,వీధి దీపాలు,మురుగు కాలువలు నిర్మించడం, సాగు, తాగునీటి సౌకర్యం కల్పించడం, నివాసయోగ్యమైన గ్రామాలు, పట్టణాలను తీర్చిదిద్దడం ఇలాంటి అవసరమైన పనులను పక్కనపెట్టి "ఫక్తు"నగదు బదిలీ స్కీములను ప్రవేశపెట్టి ఆలోచనలతో అన్ని సాంప్రదాయ రాజకీయ పక్షాలు ఒకరిని మించి మరొకరు పోటీలు పడుతున్నాయి.
  • ఏది ఉచితం ఏది అనుచితం
    అవసరమైన సంక్షేమ పథకాలు ఎవరూ వద్దనరు. మెరుగైన సమాజం కోసం సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా బండి చక్రాల్లాగా కొనసాగాల్సిందే. అనవసర అనుచిత ఉచితాలు వ్యతిరేకించాల్సిందే.ఓటు బ్యాంకు రాజకీయాల విషవలయంలో అన్ని అధికార, విపక్ష రాజకీయ పక్షాలు చిక్కుకొని విలవిలలాడుతున్నాయి.వీటిని నిజాయితీగా వ్యతిరేకిస్తే తమకు ఓట్లు పడవనే భయంతో ఒకరిని మించి మరొకరు ప్రజలు అడగని హామీలు కూడా ఇస్తున్నారు. ప్రజలకు ఏది అవసరమో ఏది అనవసరమో కనీస విచక్షణా జ్ఞానంతో ఆలోచించే పరిస్థితి కూడా వీరికి ఉండడం లేదు. అందుకే ఏ పార్టీ కూడా మిగతా పార్టీలకు భిన్నంగా వ్యవహరించడం లేదు. తాము ఒకటంటే మరొకరు రెండు అంటున్నారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఈ అనుచిత ఉచిత హామీలు తడిసి మోపెడై రాష్ట్రాల ప్రగతి కుంటుపడుతుంది. దీంతో దేశ ప్రగతి కూడా కునారిల్లుతుంది.
  • తమిళనాడు రాష్ట్రాన్ని తలదన్నిన బి.ఎస్.పి హామీలు
    ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక జాతీయ పార్టీ భారతీయ సమాజ్ వాది పార్టీ (బి ఎస్ పి.) రాష్ట్ర నాయకుడు గతంలో పోలీసు అధికారిగా పనిచేసే విద్యా శాఖలో కూడా గురుకుల విద్యాలయాల స్థాపనలో వాటిని నడిపించడంలో మంచి పేరు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సాంప్రదాయ పార్టీల (సారా) వలలో చిక్కుకుపోయారు. ఇటీవల వారు ప్రకటించిన బిఎస్పీ మేనిఫెస్టో చూస్తే వారు కూడా అనుచిత ఉచితాలను ఎన్నింటినో సాంప్రదాయ రాజకీయ పక్షాల కంటే ఎక్కువే ఇచ్చేటట్టు కనిపించింది. అందులో ప్రధానంగా మహిళలకు వాషింగ్ మిషన్లు, లాప్ టాప్ లు, మిక్సీలు, గ్రైండర్లు ఇస్తామని హామీలు కూడా గుప్పించారు. ఈ హామీలు చూస్తే తమిళనాడు రాజకీయాలు గుర్తుకొస్తున్నాయి. మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు టీవీలు ల్యాప్టాప్ లు సైకిళ్ళు,మోపెడ్లు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ ఎన్నికల మేనిఫెస్టో హామీలుగా చేరిపోయాయి.
  • ఉద్యోగుల పాత పెన్షన్ విధానం.. ప్రమాదకరం
    ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించిన పాత పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో రద్దుపరిచింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని గత 20 ఏళ్లుగా కొనసాగిస్తుంది. ఆయా రాష్ట్రాలు దీనికి ఒప్పుకొని ఈ పెన్షన్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉద్యోగుల వత్తిడికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీంకు మళ్ళీ మల్లుతున్నారు. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఈ విషయంలో కొంత ఆచరణాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల వత్తిడికి లొంగకుండా కఠిన వైఖరిని అనుసరిస్తున్నారు. కానీ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు చూస్తే మిగతా రాష్ట్రాల లాగానే వీరు కూడా మరి ఓల్డ్ పెన్షన్ స్కీంకు మళ్లీ తీసుకు వస్తామని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.దానివల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి మరింత అద్వానంగా మారుతుంది. ఉద్యోగుల ఓట్ల కోసం ఈ పని చేస్తే రాష్ట్రాలలో ఉన్న పేద ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడమే అవుతుంది. అందుకే ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి ఆలోచించి అడుగు వేయడం మంచిది. లేకపోతే "అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకే సరిపోతుంది" అనే పాత సామెత నిజమవుతుంది.
  • పిల్లి మెడకు ఎవరు గంట కట్టాలి?
    అనుచిత ఉచితాలను వ్యతిరేకించే "పిల్లి మెడకు" ఎవరు గంట కట్టాలి. అనుచిత ఉచితాల విషవలయంలో అన్ని పార్టీలు చిక్కుకుపోయాయి. ప్రస్తుతం అమలు జరుగుతున్న అనుచిత ఉచితాలు రద్దు చేసే సాహసం ఏ ఒక్క పార్టీ చేసే అవకాశం లేదు. పాత పథకాలను కొనసాగిస్తూనే వాటికి మరింత ఆర్థిక సహాయం పెంచుతూనే కొత్త పథకాలకు కూడా రూపకల్పన చేస్తున్నారు.
  • ఆపద్ధర్మ పథకాలు ఎన్నికలలో గెలిపిస్తాయా?
    ఒకసారి దేశ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఎన్నికల ఆపద్ ధర్మ పథకాలు చాలాసార్లు వర్క్ అవుట్ కాలేదు. 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మొట్టమొదట రెండు రూపాయలకు కిలో బియ్యం అనే ఎన్నికల హామీని ప్రకటించారు. దాన్ని ఓడించడానికి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక్క రూపాయి కిలోబియ్యం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ అందించారు. ఒక రూపాయి హామీని పక్కనపెట్టి రెండు రూపాయలకు కిలో బియ్యం హామీనే ప్రజలు ఆదరించి ఎన్టి రామారావును ఆ ఎన్నికలలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆపధర్మ హామీలు ప్రజలు నమ్ముతారా నమ్మరా అనే రెండు ఉదాహరణలు ప్రస్తావించుకుందాము. మొదటిది 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది కానీ తాము మాత్రం 1 లక్ష రూపాయల రుణమాఫీ మాత్రమే చేయగలుగుతామని ఆనాటి అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రకటించింది. ఒక లక్ష కంటే రెండు లక్షలు ఎక్కువైనా సరే ప్రజలు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఒక లక్ష రూపాయల రుణమాఫీని నమ్మి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అనే పథకాన్ని 2019 అసెంబ్లీ ఎన్నికల కన్నా ఆరు నెలల ముందే ప్రవేశపెట్టి అమలు చేశారు. కానీ నవరత్నాలు అనే హామీలతో ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. ఇలాంటి ఉదాహరణలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఉచిత హామీల మీదనే రాజకీయాలు నడుస్తాయా లేక వారి ప్రభుత్వం పనితీరు నిజాయితీ ఈ విషయాలు పరిగణలోకి వస్తాయా అన్న విషయాలను రాజకీయ పార్టీలు గమనించాలి. ఎన్నికల్లో ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో ఈ నిజాన్ని తెలుసుకుంటే రాజకీయ పార్టీలు ప్రజలకు ఇస్తున్నవి "వరాలా? శాపాలా? అనే విషయం అర్థం అవుతుంది.


... బండారు రామ్మోహనరావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు,
 ప్రముఖ న్యాయవాది. Cell: 98660 74027

Read More శ్రీ సాయి సన్నిధి వెంచర్ ను ప్రారంభించిన సినీ హీరో  శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్