Kavitha Arrest - ED I ఆప్ నేతలకు రూ.100 కోట్లు బదిలీ చేయడంలో కవిత కీలక పాత్ర
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ సంచలన ప్రెస్ నోట్ విడుదల చేసింది
జయభేరి, న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం సంచలనం సృష్టిస్తున్న కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 245 చోట్ల సోదాలు జరిగాయి. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశామని, మొత్తం రూ.128.79 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అరెస్టయిన వారిలో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు పలువురు ఉన్నారని వివరించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి ఎమ్మెల్సీ కవిత కుట్ర పన్నారని విచారణలో తేలింది. అనుమతుల కోసం ఆమె ఆప్ నేతలకు రూ.100 కోట్లు అందజేశారు. అవినీతి, కుట్రల ద్వారా చిరు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆప్ నేతలకు చేరవేశారని ఈడీ వివరించింది.
ఈ కేసులో ఇప్పటి వరకు 1 ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, 5 అనుబంధ ఫిర్యాదులు దాఖలయ్యాయని ఈడీ వివరించింది. 2023 జనవరి 24 నుంచి 2023 జూలై 03 మధ్య తాత్కాలికంగా రూ.128.79 కోట్లు అటాచ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది.
Post Comment