GHMC : ఎన్నికల పనుల్లో చేతి వాటం....
- అడ్డదారిలో ఎలక్షన్స్ పనులు చేజిక్కించుకుని తమ బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, అధికారులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జయభేరి, హైదరాబాద్, మే 9 :
ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు వారికి ఫుల్ హ్యపీ.... వాస్తవానికి వారు జీహెచ్ఎంసీలో పనులు చేయించాల్సిన ఇంజినీర్లు. కానీ ఎన్నికలొచ్చాయంటే చాలు వారు కాంట్రాక్టర్లుగా మారిపోతారు. అడపాదడపా పనులు చేయించే లైసెన్స్ కలిగిన కాంట్రాక్టర్లను బినామీలుగా పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి లైటింగ్, వీడియో, డీఆర్సీ సెంటర్లు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు, స్ట్రాంగ్ రూమ్‌ల నిర్మాణం, డీఆర్సీ సెంటర్లలోని సిబ్బందికి భోజనాలు వంటి పనులను కొటేషన్లు, షార్ట్ టెండర్ల ప్రక్రియలతో కేటాయించాలని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లా ఎన్నికల అధికారి లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చేసినా క్షేత్ర స్థాయిలో అవి ఏమాత్రం అమలు కావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డదారిలో ఎలక్షన్స్ పనులు చేజిక్కించుకుని తమ బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, అధికారులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ జోన్‌లోని నాంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూం నిర్మాణ పనులను ఓ ఇంజనీర్ చేజిక్కించుకుని తన ఇద్దరు బినామీ కాంట్రాక్టర్లతో పనులు చేయించిన విషయం ఇటీవలే బయటపడినా కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మాసాబ్ ట్యాంక్ సాంకేతిక భవన్‌లో నిర్మించిన నాంపల్లి నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ నిర్మాణ పనులు సదరు ఇంజినీరే చేజిక్కించుకున్నట్లు చర్చ జరుగుతుంది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన ఆఫీసర్ నిజాంకాలేజీలో ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్‌లోని స్టాఫ్‌కు టీ, టిఫిన్, భోజనాలకు సంబంధించిన కాంట్రాక్టును చేజిక్కించుకున్నట్లు సమాచారం. సదరు ఆఫీసర్ ఆ టీ, టిఫిన్, భోనాలను నిజాం కాలేజీ క్యాంటీన్ నుంచే సమకూర్చి భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇదే రకంగా ఖైరతాబాద్ జోన్‌లో మరో ఇంజినీర్, ఉప్పల్‌లో ఓ ఇంజినీర్ పనులు చేజిక్కించుకున్నట్లు సమాచారం.
ఎలక్షన్ పనులను నిబంధనలు ఉల్లంఘించి నామినేషన్ పద్దతిన కేటాయిస్తున్నా, ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ నిర్మాణ పనులు ఖైరతాబాద్ జోన్‌లోని మెహిదీపట్నంకు చెందిన ఇంజినీర్ చేపట్టిన విషయం ఇటీవలే బట్టబయలైన, కమిషనర్ గానీ, జిల్లా ఎన్నికల అధికారి గానీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ గానీ ఎందుకు చర్యలు చేపట్టలేదన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. అడ్డదారిలో పనులు చేజిక్కించుకుంటున్న ఇంజనీర్లు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరి వాటాలు వారికి అప్పగించటమే వారిపై చర్యలు తీసుకోక పోవడానికి ప్రధాన కారణమా? అంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది చర్చించుకోవడం కనిపించింది.
Post Comment