వైకుంఠధామానికి మోక్షమెప్పుడో
అధికారులకు మొరపెట్టగా సూతరిగుడా గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 25 లో దాదాపు 24 గుంటల స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్మశానవాటిక కోసం కేటాయించారు. వైకుంఠధమాం అభివృద్ధి కోసం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నుండి సుమారు రూ.20 లక్షల నిధులతో వైకుంఠధామనికి భూమి పూజ చేశారు. కానీ కొబ్బరికాయ కొట్టి సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
జయభేరి, మేడ్చల్ :
అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని సూతరిగుడా గ్రామ పరిస్థితి. స్మశానవాటిక నిర్మాణం కోసం దాదాపు రూ.20 లక్షలు కేటాయించి శంకుస్థాపన చేసి సంవత్సరాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే సూతరిగుడా గ్రామంలో ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు చేయడానికి సరైన స్మశానవాటిక లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో గ్రామ చెరువుకు అనుకోని ఉన్న స్థలంలో దహన సంస్కారాలు నిర్వహించేదని కానీ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడి రోడ్లపైనే దహనం చేయడం జరిగిందన్నారు.

పంట పొలాలను కాపాడండి:- రైతులు
సూతరిగుడా గ్రామ చెరువులోని నీరు బయటకు వెళ్ళడానికి సరైన నాలా వ్యవస్థ లేకపోవడంతో చెరువులోని డ్రైనేజీ నీరు పంట పొలాలలోకి చేరి కష్టపడి పండించిన పంట నాశనం అవుతుందని గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. స్మశానవాటిక ఏర్పాటు కోసం అధికారులు కేటాయించిన స్థలం పంట పొలాలకు అనుకుని ఉందని ఆ స్థలంలోని కొంత భాగాన్ని చెరువు నీరు బయటకు వెళ్లేందుకు నాలా నిర్మాణం కోసం కేటాయించి తమ పంట నష్టం కాకుండా చూడాలని కోరుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా చెరువు నీరు తమ పొలాలలో ఉండటం వల్ల పంట సాగుకు దూరంగా ఉన్నామని రైతులకు ప్రధాన సమస్యగా ఉన్న చెరువు నీరు బయటకు వెళ్ళడానికి అధికారులు మార్గం చూపాలని రైతులు కోరుతున్నారు. సర్వే నెంబర్ 25 లో స్మశానవాటిక కోసం కేటాయించిన స్థలాన్ని వైకుంఠధామనికి కాకుండా వేరే ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.


