TS Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు
ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, IMD తాజా అప్డేట్స్ ఇవే
- తెలంగాణలో భానుడి ప్రభావం పెరుగుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా IMD తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపంతో జనాలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 10 గంటల లోపు పనులు చూసుకుంటున్నారు. మళ్లీ సూర్యుని ప్రతాపం తగ్గిన తర్వాతే.... బయటకు రావడానికి మొగ్గుచూపుతున్నారు. తెలంగాణలోని పలుచోట్ల ఏకకాలంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు చోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఆరెంజ్ హెచ్చరికలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం (మే 2 మధ్యాహ్నం తర్వాత) విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం... తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు ఎల్లో వార్నింగ్‌లు ఇచ్చారు.
మే 2న: జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువసేపు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో వార్నింగ్‌లు జారీ చేశారు.

మే 3: తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.
మే 4: పొడి వాతావరణం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఎక్కువసేపు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. ఖమ్మం, నల్గొండ, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు.

మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా కంటే ముందు 2019, 2018, 2015లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు చాలాసార్లు నమోదయ్యాయి. కరోనా తర్వాత గరిష్టంగా 42 డిగ్రీలు నమోదైంది, అయితే ఈ వేసవిలో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది, రాత్రి ఉష్ణోగ్రత కూడా 30 డిగ్రీలకు చేరుకుంది మరియు గాలిలో తేమ 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. బుధవారం హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 43.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గాలిలో తేమ శాతం 16గా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా గ్రేటర్ లో వడగాలులు వీస్తున్నాయి.


