Telangana : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు
కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? బీజేపీ ప్రభుత్వమా? అన్నది అర్థం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని చౌకీదార్ చోర్ అని అంటున్నారని, అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారని కేటీఆర్ అన్నారు. మోదీ చోటాభాయ్ రేవంత్‌రెడ్డి గుజరాత్ మోడల్‌ను పొగుడుతూ బీజేపీ పాట పాడుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని, 40 సీట్లు కూడా రాదని దుయ్యబట్టారు.
రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే అని కేటీఆర్ అన్నారు. పార్టీ మారాలన్న డాన్ నాగేందర్ నిర్ణయం సరికాదన్నారు. అధికారం కోసం ఆశపడి గెలిచిన ప్రజలకు ద్రోహం చేశారని ఆక్షేపించారు. ఖైరతాబాద్ ప్రజలు బీఆర్ ఎస్ ను గెలిపించి దానం నిర్ణయం తప్పని నిరూపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. సికింద్రాబాద్‌లో పద్మారావు విజయంతో బీఆర్‌ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని కేటీఆర్ కోరారు. కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే బీజేపీని, మోదీని అడ్డుకోవడం సాధ్యమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం పడిందని.. బీఆర్ ఎస్ తరపున పోరాడుతామన్నారు. మద్యం కుంభకోణంలో అన్నీ బయటపెడతామని చెప్పిన కిషన్ రెడ్డి.. వాటిని కోర్టుకు ఎవరు ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కవితపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. అక్రమ కేసుల విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Post Comment