Revanth : ఆపరేషన్ ఆకర్ష్.. కు హస్తం... టార్గెట్ రీచ్ కాలేమంటూ అధిష్టానానికి వివరించారట రేవంత్.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన అన్ని జిల్లాల్లో నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
జయభేరి, హైదరాబాద్, ఏప్రిల్ 16:
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన అన్ని జిల్లాల్లో నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే, జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు అడ్డుపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరికను అదిలాబాద్ జిల్లాలో స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ చేరికకు స్థానిక పార్టీ నేతలు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో సంగిశెట్టి జగదీశ్, రంగారెడ్డి జిల్లాలో దండం రామ్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందు వస్తున్నప్పటికీ స్థానిక ముఖ్యనేతలు అడ్డు చెబుతుండటంతో వారి చేరికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
బీసీ నేతలు ఇక తక్కువ సీట్లు ఇచ్చారంటూ గుర్రుగా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత వీహెచ్ తనకు ఖమ్మం నుంచి అవకాశం కల్పించాలని గట్టి పట్టు పడుతున్నారు.పార్లమెంటు సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ అంశం చర్చనీయాంశంగా మారుతుండడంతో.. పెండింగ్ లో ఉన్న మూడు సీట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్. హైదరాబాద్ మినహా పెండింగ్ లో ఉన్న కరీంనగర్, ఖమ్మం సీట్లలో బీసీ అవకాశాన్ని పరిశీలించాలని కోరారట. బీసీ కులగణన చేసి ఆ వర్గాలకు న్యాయం చేస్తామని ఇప్పటికే పార్టీ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో.. రాజకీయంగా తగిన సీట్లు కేటాయించాలని సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటితే.. టార్గెట్ రీచ్ కాలేమంటూ అధిష్టానానికి వివరించారట రేవంత్.
Post Comment