medical : ఎయిమ్స్‌లో మరిన్ని వైద్య సేవలు అందించాలి

medical : ఎయిమ్స్‌లో మరిన్ని వైద్య సేవలు అందించాలి

జయభేరి, మంగళగిరి:
మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, మంగళగిరి ఎయిమ్స్ పాలక మండలి సభ్యులు వల్లభనేని బాలశౌరి కోరారు. ఢిల్లీలో  కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ పుణ్య శ్రీవాత్సవ, జాయింట్ సెక్రటరీ అంకితా మిశ్రా బుందేలా తో  గురువారం ఆయన  సమావేశమయ్యారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు.  మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో 25 లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరింత మంది రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించి రాష్ట్రంలోనే నెంబర్ ఒన్ ఆసుపత్రిగా పేరుగాంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్నందున ఎటువంటి రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అవసరమైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రతి రోజూ తరలివచ్చే రోగుల  సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ 19 సమయంలో తాత్కాలిక క్రిటికల్ కేర్ బ్లాక్ ను ఏర్పాటు చేసి, రోగులకు వైద్య సేవలు అందించాలని, అదేవిధంగా శాశ్వతంగా ఒక క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయాలన్నారు.  రోగులు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు ఎయిమ్స్ లో మాత్రమే పొందగలుగుతారని, ప్రతి ఒక్కరూ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుని ప్రజా మన్ననలను పొందేలా తమ వంతు కృషి చేయాలని ఎంపీ బాలశౌరి కోరారు.

Read More ఫార్మా సిటీ ప్రమాదం