ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు పిలుపు
- అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్ కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పరచకూడదని 2015 వేతన సవరణలో 43% ఫిట్‌మెంట్ ఇచ్చామని ఉద్ఘాటించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని అర్థిక ప్రయోజనాలను ఏనాడూ వెనుకాడకుండా సకాలంలో అందించిన విషయం మీ అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు.
జయభేరి, అమరావతి, మే 3 :
ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..! అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఈ ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఉద్యోగులు తమ పోస్టింగ్‌లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసిందని తెలిపారు. విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డీఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.అంగన్‌వాడీ ఉద్యోగుల జీతాలను రూ.4,200 నుంచి రూ.10,500కు పెంచినట్లు వివరించారు. ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు అందించి, ఉద్యోగ సంఘాల నాయకులతో స్నేహపూర్వక చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్ కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పరచకూడదని 2015 వేతన సవరణలో 43% ఫిట్‌మెంట్ ఇచ్చామని ఉద్ఘాటించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని అర్థిక ప్రయోజనాలను ఏనాడూ వెనుకాడకుండా సకాలంలో అందించిన విషయం మీ అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఎంతటి అర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడంలో ఏనాడూ వెనకాడలేదని అన్నారు. ‘
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వైసీపీ నాయకులు అవమాన పరుస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక వారి గౌరవాన్ని కాపాడుతాం. ఉద్యోగులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి స్నేహపూర్వక పరిస్థితులు నెలకొల్పుతాం. నేటి అప్రజాస్వామ్య, నియంతృత్వ పాలనతో గూండాయిజం, ఫ్యాక్షనిజంతో రాష్ట్రం మళ్లీ 30 ఏళ్లు వెనక్కివెళ్లిపోయింది. ఒక్క ఛాన్స్ నినాదాన్ని నమ్మినందుకు రాష్ట్ర భవిష్యత్ అంధకారమైంది. బ్రాండ్ ఇమేజ్ నాశనమైంది. రాష్ట్రం తీరని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మన అందరి కలలు సాకారం కావడానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్ అందించడానికి, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కలసికట్టుగా పని చేద్దాం. ఎవరిది ప్రజాస్వామ్యం? ఎవరిది అప్రజాస్వామ్యం? ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం? ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వం? భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి! ఆలోచించండి ! చర్చించండి ! చైతన్య పరచండి! సరైన నిర్ణయం తీసుకోండి !!! ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి’’ అని చంద్రబాబు కోరారు.


