అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో భయం.. భయం...
- ఈనెల 10, 11 తేదీల్లో ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో వారు పాల్గొనే సభలు, రోడ్డుషోల విజయవంతానికి ప్రత్యేక దృష్టిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములు మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలెంజ్‌గా మారాయి.
జయభేరి, హైదరాబాద్, మే 9 :
పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా ఉన్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే అధిష్టానం నుంచి చివాట్లు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. రెండురోజుల క్రితం కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో, సదరు లీడర్లలో కదలిక వచ్చినట్టు తెలుస్తున్నది. ఈనెల 10, 11 తేదీల్లో ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో వారు పాల్గొనే సభలు, రోడ్డుషోల విజయవంతానికి ప్రత్యేక దృష్టిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములు మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలెంజ్‌గా మారాయి. ఇన్ చార్జులుగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులు గెలిస్తే పదవులు దక్కుతాయని, ఓడితే ఉన్న పదవులు ఊడుతాయనే సంకేతాలను అధిష్టానం ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది.
ఈ సందర్భంగా నిర్వహించే సభలు, రోడ్డు షోల సక్సెస్ కోసం ప్లాన్ చేస్తున్నారు. తమ సొంత నియోజకవర్గాల్లో ఓటింగ్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వచ్చిన ఓట్ల కంటే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ తక్కువ ఓట్లు వస్తే, హైకమాండ్ నుంచి చివాట్లు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. అందుకని నియోజకవర్గంలోని పలు వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని మైనార్టీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేల కదలికలపై కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదని ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ సీరియస్‌గా క్లాస్ తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. పోలింగ్ ముగిసేవరకు లీడర్ల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్‌పై కూడా అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.


