వందే రామం.. జగద్గురుం..
నమస్తే.. ముందుగా 'జయభేరి' న్యూస్ ప్రేక్షకులందరికీ... శ్రీరామనవమి శుభాకాంక్షలు...
నమస్తే.. ముందుగా 'జయభేరి' న్యూస్ ప్రేక్షకులందరికీ... శ్రీరామనవమి శుభాకాంక్షలు...
ఒకసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుందట. దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఇలా శ్లోకంతో మంత్రోపాసన చేసా డట... శ్రీ రామ రామ రామేతి... రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే || ఆని మనం మనస్ఫూర్తిగా శ్రీరాముని స్మరించుకుంటూ మూడుమార్లు స్మరిస్తే చాలు,ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు,పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం....
శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు ఆనాడు భక్త రామదాసు.
మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవని మన పెద్దలు చెప్పిన పురాణ ఇతిహాస సత్యం... అంతలా రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట!
ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకనే "రవి" అంటే సూర్యుడు. రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు కాబట్టి ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు ఉన్నారు .వీరిలో రఘు అనే రాజు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. అందుకే రామున్ని ,రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.
శ్రీరామ నవమి గూర్చి చారిత్రాత్మకమైన చరిత్రను పరిశీలిస్తే..... వశిష్ట మహాముని దశరథ రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడట. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడట. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు, పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడట. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడట. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారట. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారట. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. ఇది చరిత్ర చెబుతున్న శ్రీరాముని జననానికి ముఖ్య కారణం.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు ఆని పురాణ ప్రతీతి.పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సందర్భం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే శ్రీ సీతారాముని భక్తులు ఘనంగా కళ్యాణాన్ని జరుపుకుంటారు. దానిని ఆదిదంపతులు కళ్యాణ మహోత్సవంగా మనకు శ్రీ సీతారాముల వారి పాటలు వీనుల విందుగా వినపడుతుంటాయి...
శ్రీరామనవమిపండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. తొమ్మిది రోజులు పాటు ఈ ఉత్సవాలను జరిపి ఆ తర్వాత ఉత్సవాలను ముగిస్తారు.ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు.దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధిస్తారు..దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం.నీతి, సత్ప్రవర్తన మరియు సద్గుణం ద్వారా ఆదర్శవంతమైన రాజుగా భూలోకంలో శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుంటారు. అలాగే ఏకపత్ని బ్రతుడుగా బహుభార్యత్వాన్ని రద్దు చేస్తూ ఆయన నడిచిన తీరును నేటి కుటుంబ వ్యవస్థకు పటిష్ట పునాదిగా భావిస్తారు.
శ్రీరామ నవమి రోజున శ్రీరాముని జననమే కాకుండా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా హిందూ ఆచార ధర్మ ప్రకారం మన దేశంలో ఎక్కువగా జరుపుతారు. అలాగే భారతీయ సనాతన ధర్మానికి కుటుంబ వ్యవస్థకు ప్రతిష్టమైన పునాదిని వేసిన శ్రీ సీతారాముల వారిని ఆదిదంపతులుగా భావిస్తూ వారిని నిత్యం ప్రతి ఇంట్లో వారి విగ్రహాలను పెట్టుకుని పూజించడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున జీ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటు....
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు
Post Comment