Tdp: కూటమిలో టీడీపీ జోష్...
- ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి మూడు దశల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది.
జయభేరి, విజయవాడ, మే 9:
ఏపీ విషయంలో ప్రధాని మోదీ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. పేరుకే కూటమి కానీ.. తెర వెనుక బిజెపి అగ్రనేతలు జగన్ కు సహకారం అందిస్తున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికల నిర్వహణపరంగా తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి సహకారం దక్కడం లేదని టాక్ నడిచింది. ఒకానొక దశలో టిడిపి శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి. బిజెపితో పొత్తు వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందన్న నిర్ణయానికి వచ్చాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. వరుస పర్యటనలతో ఏపీలో కూటమికి ఒక ఊపు తెచ్చారు. కీలక అధికారులపై వేటువేసి ఎన్నికల నిర్వహణలో కూటమికి తమ సాయం ఉంటుందని సంకేతాలు పంపారు. అదే సమయంలో జగన్ స్వరంలో సైతం మార్పు వచ్చింది. ఎన్నికలు సవ్యంగా జరుగుతాయని తాను అనుకోవడం లేదని.. అధికారులపై వరుస పెట్టి బదిలీల వేటు వేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మరుక్షణం టిడిపిలో సంతృప్తి ప్రారంభమైంది. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత గత నెలలో చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సభలో జగన్ సర్కార్ పై ప్రధాని మోదీ విరుచుకుపడతారని భావించారు. కానీ పొడి పొడి మాటలకే ఆయన పరిమితమయ్యారు. దీంతో రకరకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కూటమిపై ప్రధాని పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. జగన్ పై ఇప్పటికీ అభిమానంతోనే ఉన్నారని సోషల్ మీడియా హోరెత్తింది. అదే సమయంలో టిడిపి అభ్యంతరాలు తెలిపిన అధికారులపై ఎటువంటి బదిలీ వేటు పడలేదు. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.


