పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటీఫికేషన్..
- మే 9 (గురువారం) వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా.. ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
జయభేరి, హైదరాబాద్, మే 2
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గురువారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. మే 9 (గురువారం) వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా.. ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 9న రాజీనామా చేయగా.. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవగా.. 2027, మార్చి వరకూ పదవీకాలం ఉంది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.


