Ktr : డైలామాలో కేటీఆర్ ఫ్యూచర్
తీహార్ జైలుకు వెళ్లి చెల్లిన చూసొచ్చిన వెంటనే ఆయనకు ఎన్నికల అఫిడవిట్ ఉచ్చు బిగుసుకుంది. ఆ క్రమంలో ఆయన పోస్టుపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతుంది.వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మరోవైపు వలసలు గులాబీ పెద్దలకు షాక్‌ల షాక్‌లు ఇస్తున్నాయి.
జయభేరి, హైదారాబాద్ :
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్యూచర్ డైలమాలో పడింది. అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన గులాబీపార్టీ చిన్నబాస్ లోక్‌సభ ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయారు. అసలే సీఎం సీటు దిగాల్సి వచ్చిందన్న బెంగతో కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదు. ఇటు చూస్తే ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కకపోవడంతో కేటీఆర్ పార్టీ శ్రేణులకు నల్లపూస అయిపోయారు.
తానే సీఎం అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో సీఎం, సీఎం అని నినాదాలు కూడా చేయించుకున్నారు.అయితే ఆ కల్వకుంట్ల దొరలు కన్న కలలు ఒక్కటి కూడా నెరవేరలేదు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుస పరాభవాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన బైపోల్స్‌లో కూడా కారు టైర్లు పేలిపోయాయి. ఆ దెబ్బతో ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పలువురు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. మరికొందరు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారు.
ఇలాంటి కష్టకాలంలో యాక్టివ్‌గా ఉంటూ పార్టీ నాయకులను మరోపార్టీకి వెళ్లిపోకుండా ఆపాల్సిన కేటీఆర్ సైలెంట్ గా ఉండటం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. అసలు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా క్యాపబులేనా? అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని ఆ పోస్టు నుంచి దించాలని డిమాండ్లు కూడా మొదలయ్యాయి.లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటుతామని బీరాలు పలికిన ఆయన.. ఇప్పుడు అవమాన భారంతో బయటకు రావడం లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల అఫిడవిట్‌పై కోర్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ఇలా బీఆర్ఎస్‌లోని పెద్ద తలకాయల చుట్టూ గట్టిగానే ఉచ్చు బిగుస్తోంది.
ఈ పరిస్థితుల్లో కేటీఆర్‌కు పార్టీని హ్యాండిల్ చేసే సినిమా లేదని.. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు తీసి మళ్లీ ఫారిన్ పంపించేస్తే బెటర్ అన్న సూచనలు కూడా వస్తున్నాయంట.ఎంత కాదన్న రెండు టర్మ్‌లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పార్టీని వదులుకోలేరు. కొడుకు కేటీఆర్ యాక్టివ్ రోల్ పోషించిన లోక్‌సభ ఎన్నికల్లో సొంత జిల్లా మెదక్ లోనూ బీఆర్ఎస్ కు కలిసి రాలేదు. ఇక రేపోమాపో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఇటు చూస్తే పార్టీ కేడర్ పూర్తిగా నిరుత్సాహంలో ఉంది. దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మార్పు పైన కేసీఆర్ ఆలోచన చేస్తున్నారంట.ట్రాక్ తప్పిన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ఎలాగొలా గాడిలో పెట్టడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పించాలని భావిస్తున్నారంట.
కేటీఆర్ స్థానంలో కుటుంబంలోనే మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకు ఆ పదవి కట్టబెట్టాలా అనేదానిపై కేసీఆర్ సమాలోచనలు కొనసాగిస్తున్నారంటున్నారు.ఆ క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు రేసులో హరీష్‌రావు పేరు ఫోకస్ అవుతుంది. హరీష్ కు అప్పగించినా కుటుంబ సభ్యులకే మరోసారి పదవి ఇచ్చారనే విమర్శలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. దీంతో హరీష్ తో పాటుగా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల నుంచి ఎవరినైనా రెండో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయాలని చూస్తున్నారంట. తెలంగాణ వచ్చినప్పుడు దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఘనంగా ప్రకటించారాయన. గెలవగానే ఆ విషయం మర్చిపోయారు. ఇప్పుడు రెండో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవైనా ఆ వర్గానికి కేటాయించాలని లీడర్ని వెతుక్కుంటున్నారంట. మొత్తానికి అలా సాగిపోతోంది కారు పార్టీ ప్రయాణం.
Post Comment