Medchal : శామీర్ పేట్ లో రాజీవ్ రహదారి పక్కన అక్రమంగా వెలసిన షెడ్

అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని స్థానికుల ఆగ్రహం

  • అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు -  పంచాయతీ కార్యదర్శి మౌనిక

Medchal : శామీర్ పేట్ లో రాజీవ్ రహదారి పక్కన అక్రమంగా వెలసిన షెడ్


జయభేరి, ఏప్రిల్ 24 :

పంచాయితీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. భవన నిర్మాణాలకు అయితే జీ ప్లస్ టు వరకు అనుమతులు జారీ చేస్తారు. కానీ మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారి పక్కనే ఓ షెడ్  నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతోంది. అయితే ఈ షేడ్ నిర్మాణం అక్రమంగా కొనసాగుతున్నప్పటికి అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఈ నిర్మాణం రాజీవ్ రహదారి హైవే పక్కన ఉండడంతో 100 మీటర్ల సెట్ బ్యాక్ వదిలేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం 30 మీటర్ల సెట్ బ్యాక్ ను మాత్రమే వదిలేసి నిర్మాణం కొనసాగిస్తున్నారు.

Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

అయితే ప్రతి నిత్యం వందలాది మంది ప్రయాణికులు, వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం భవిష్యత్ లో ఈ నిర్మాణం వల్ల ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అక్రమ నిర్మాణం పై గతంలో గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు పంపించగా కొద్దీ రోజులు ఆగిన నిర్మాణం ప్రస్తుతం పూర్తయ్యే దశకు చేరుకోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలపై ఓ కన్నేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ విషయమై గ్రామ కార్యదర్శి మౌనిక ను వివరణ కోరగా ఈ అక్రమ భారీ షెడ్ నిర్మాణం పై గతంలో తాము ఫిర్యాదులు అందుకున్నామని, దీనిపై నిర్మాణ దారులకు నోటీసులు సైతం అందించామని తెలిపారు. అయితే వారి నుండి ఎలాంటి స్పందన రాలేదని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Read More తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి