ఓ దివ్యమైన యాత్రస్థలిని తలపించింది
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జియ్యర్ స్వామివారి మంగళాశాసనములతో... జగదాచార్యులు భగవద్రామానుజుల 1007 తిరునక్షత్రాన్ని ఆదివారం ఒక మహోత్సవంగా జరుపుకున్నాం...
జయభేరి, ఉప్పల్ :
ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక అనామకమైన చౌరస్తాగా వున్న ప్రాంతం - శ్రీరామానుజుల భవ్యమైన మూర్తిని ప్రతిష్టించాక ఇవాళ భాగ్యనగరంలోనే ఒక దివ్యస్థలిగా మారిపోయింది... ఇవాళ ఆచార్య అనుగ్రహాన్ని పొందడానికి - శ్రీరామానుజ సర్కిల్ ప్రాంతానికి, ఆంజనేయ బృహన్మూర్తి కొలువైన రామానుజ మందిరానికి విచ్చేసిన దాదాపు వెయ్యి మందిని చూస్తే మనసు పులకించిపోయింది... ఇదొక జన సమ్మర్దమైన ఓ మామూలు చౌరస్తాలాగా కాక ఓ దివ్యమైన యాత్రస్థలిని తలపించింది... ఇది అపర రామానుజులైన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి కరకమలములచే ప్రతిష్టితమైన శుభ ముహూర్తఫ్రభావమే అని నా ప్రగాఢ విశ్వాసం... ఇవాల్టి శుభోదయాన రామానుజ సర్కిల్ 8వ వార్షికోత్సవాన్ని, వారి 1007వ తిరునక్షత్రముని పురస్కరించుకొని సర్కిల్ లోని ఆచార్యమూర్తికి ఆరాధన, తిరుమంజనం, ఆచార్య అష్టోత్తర శతనామార్చన, భజ యతిరాజ స్తోత్ర సామూహిక పారాయణం తదితర సంప్రదాయ కైంకర్యములన్నీ ఎంత అద్భుతంగా జరిగాయో చూస్తుంటే రెండు కళ్లు చాలలేదు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను...

సర్కిల్ చుట్టూ వేలాది వాహనాలపై వెళ్లేవారంతా, ఆగి ఆచార్య దివ్యమంగళమూర్తిని దర్శించుకొని పోవడం చూస్తే మహదానందం కలిగింది... ప్రఖ్యాత సోలిస్ కంటి ఆస్పత్రి అధినేత శ్రీమాన్ రాము గారు ప్రతినెల ఆర్ద్ర నక్షత్రం రోజు భగవద్రామానుజుల విగ్రహమూర్తికి సంప్రదాయ ఆరాధనా కైంకర్యం నిర్వహించడంతో పాటు ప్రసాద వితరణ కూడా చేస్తున్న సంగతి మనకు విదితమే.... ఈ రోజు కూడా ఐదువందల మందికి పైగా ఆచార్య నివేదిత అన్న ప్రసాదాన్ని, 60లీటర్ల పెరుగుతో చేసిన మజ్జిగ పానీయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు... ఈనాటి సర్కిల్ లోని భగవద్రామానుజుల తిరునక్షత్ర, విగ్రహ 8వ వార్షికోత్సవానికి స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పోరేటర్లు పి.దేవేందర్ రెడ్డి, జెరిపోతుల ప్రభుదాస్, మాజి కార్పొరేటర్ జి.శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర విభాగాలకు చెందిన మరెందరో అధికారులు హాజరయ్యారు.
Post Comment