KTR : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
సోమవారం పొద్దున్నే రండి
జయభేరి, హైదరాబాద్, జూన్ 13 :
ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఇంతకు ముందుఓ సారి నోటీసులు జారీ చేసినా.. తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని రాలేనని.. వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆ మేరకు ఏసీబీ అధికారులు ఇప్పుడు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో ఓ సారి ఈడీ ఎదుట కూడా హాజరయ్యారు. ఓ సారి ఏసీబీ విచారణకు వెళ్లినా లాయర్ ను అనుమతించలేదని మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. అప్పట్లోనే మరోసారి పిలుస్తారని ప్రచారం జరిగింది కానీ ఎలాంటి నోటీసులు రాలేదు. చాలా కాలం తర్వాత గత నెలలో నోటీసులు ఇచ్చారు.
ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ నిర్వహించే కంపెనీకి హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి యాభై కోట్ల ను చెల్లించారు. అయితే అలాంటి చెల్లింపుల కోసం కనీసం కేబినెట్ అనుమతి కూడా తీసుకోలేదు. కేవలం కేటీఆర్ నోటి మాట ద్వారానే చెల్లించేశారు. తర్వాత ఎన్నికల్లో.. బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యాభై కోట్ల గోల్ మాల్ పై చర్యలు ప్రారంభించారు. అయితే తన ఆదేశంతోనే చెల్లించామని కేటీఆర్ అంగీకరిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కోసం.. హైదరాబాద్ కోసమే చెల్లించామని అంటున్నారు. ఇందులో అవినీతికి అవకాశమే లేదని చెబుతున్నారు.